
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ ఈ స్కీమ్ అమల్లో ఉంది. ముందుగా కర్ణాటకలోనే ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఉచిత ప్రయాణ స్కీమ్‌తో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. పురుషులకు కూర్చేనేందుకు కాదు కదా కనీసం నిలబడేందుకు కూడా కొన్ని సార్లు, కొన్ని బస్సుల్లో చోటు ఉండటం లేదు. ఈ స్కీమ్‌పై గతంలో అనేక మంది పురుషులు అసహనం వ్యక్తం చేశారు. అయితే కర్ణాటక ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో కొన్ని సీట్లు పురుషలకు కేటాయించాలని ఆర్టీసీ సంస్థను ఆదేశించింది.
కానీ, బస్సుల్లో పురుషులకు కేటాయించిన సీట్లను మహిళా ప్రయాణికులు ఆక్రమించుకుంటున్నారనే ఫిర్యాదు మేరకు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మైసూరు నగర విభాగం శుక్రవారం ఒక ఉత్తర్వు జారీ చేసింది. అదేంటంటే.. బస్సుల్లో పురుషులకు నిర్దేశించిన సీట్లలో వాళ్లనే కూర్చునేలా చూడాలని సిబ్బందిని ఆదేశించింది. 2023లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అనుమతించే శక్తి పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు, కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(BMTC) మినహా అన్ని రవాణా సంస్థలను పురుషులకు 50 శాతం సీట్లు రిజర్వ్ చేయాలని ఆదేశించింది. అయితే పురుషులకు కేటాయించిన సీట్లలో మహిళలు కూర్చోవచ్చు, కానీ పురుషుడు కూర్చోవాలనుకుంటే వారు ఆ సీటును వదిలి వెళ్ళవలసి ఉంటుంది. అయితే, ప్రభుత్వం ఆశించినంత సజావుగా ఈ నిబంధన అమలు జరగడం లేదు. పురుషులకు సీట్లు కేటాయించినా వాళ్లు నిలబడవలసి వస్తుంది.
దీంతో ఎస్ విష్ణువర్ధన అనే ప్రయాణికుడు ఆర్టీసీకి ఫిర్యాదు చేశారు. పురుషులకు కేటాయించిన సీట్లను మహిళా ప్రయాణికులు ఆక్రమించుకుంటున్నారని, దీనివల్ల పురుష ప్రయాణికులకు సీట్లు దక్కకుండా చేస్తున్నారని విష్ణువర్ధన తన పిటిషన్‌లో ఆరోపించారు. దీంతో మైసూరు నగర యూనిట్ డివిజనల్ కంట్రోలర్ ఒక నోటీస్‌ను జారీ చేశారు. ఇకపై పురుషులకు కేటాయించిన సీట్లలో వాళ్లే కూర్చునేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. సో ఇకపై కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనివ్వాలని సిబ్బంది మహిళలకు సూచించే అవకాశం ఉంది. అలాగే బస్సుల్లో “పురుషులను గౌరవించడం మన సాంప్రదాయం, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం” అని రాసినా ఆశ్చర్యపోవాల్సిన అసవరం లేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.