అందమైన ప్రదేశాలకు వెళ్లినప్పుడు సరదాగా స్నేహితులతో కలిసి, లేదా ఒంటరిగానే సెల్ఫీ పోజులో ఫొటోలు తీసుకోవడం ప్రస్తుత కాలంలో శరామాములై పోయిన విషయం. అయితే..సెల్ఫీలు తీసుకునే క్రమంలో కేవలం ఫొటో తీసుకోవడం మీదనే కాక, చుట్టుపక్కల కూడా గమనించుకోవాలి. లేకపోతే ఏమైనా జరగవచ్చు. ఈ రోజుల్లో కొందరు కావాలనే సెల్ఫీల కోసం విన్యాసాలు చేస్తూ లేనిపోని సమస్యలను, ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. కొండచరియల అంచుకు వెళ్లి, రైలు వెళ్తున్న క్రమంలో చేతులు బయటకు పెట్టి.. ఇలా ఏవేవో విన్యాసాలు చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటి సెల్ఫీలకు లైకులు బాగానే వస్తాయి అంతా బాగుంటే.. కానీ ఫొటో తీసుకునే క్రమంలో ఏదైనా అవాంతరం ఏర్పడి సమస్యాత్మకంగా మారితే..? అని ప్రస్తుత కాలంలో చాలా మంది ఆలోచించడంలేదు. అలాంటి ఘటనే కర్ణాటకలో జరిగింది. సెల్ఫీ తీసుకుంటూ నలుగురు బాలికలు జలపాతంలో జారిపడి మరణించారు.
కర్ణాటక, బెలగావిలోని కామత్ గల్లిలో ఉన్న మదర్సాకు చెందిన 40 మంది బాలికలు కిత్వాడ్ జలపాతం వద్దకు విహారయాత్ర కోసం శనివారం వెళ్లారు. వారిలోని ఐదుగురు బాలికలు జలపాతం అంచుకు వెళ్లి.. సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా.. జారి నీళ్లల్లో పడిపోయారు. వారు ఐదుగురిలోని ఒక బాలికను అక్కడే ఉన్న యువకులు రక్షించి, వెంటనే బెలగావి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. కానీ ఆ యువకులు మిగిలిన నలుగురు బాలికలను రక్షించలేకపోయారు. మృతులను ఉజ్వల్ నగర్‌కు చెందిన ఆసియా ముజావర్(17), అంగోల్‌కు చెందిన కుద్రాషియా హస్మ్ పటేల్(20), రుక్కాషా భిస్త (20), ఝట్‌పట్ కాలనీకి చెందిన తస్మియా(20)గా అధికారులు గుర్తించారు. రక్షించిన బాలికను ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
ఈ ఏడాది జులైలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. కర్ణాటకలోని నీర్‌సాగర్ రిజర్వాయర్ వద్ద 22 ఏళ్ల ఓ యువకుడు సెల్ఫీ తీసుకుంటూ అందులో పడి మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత నీర్‌సాగర్ రిజర్వాయర్ వద్ద పర్యాటకులు రావడాన్ని పోలీసులు నిషేధించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..