కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్‌పై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బలరాం నాయక్‌పై EC ఈ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభల ఎన్నికల్లో మూడేళ్ల పాటు పోటీ చేయకుండా ఆయనపై నిషేధం విధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి పోటీ చేసిన బలరాం నాయక్.. నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయం వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడంతో ఆయనపై అనర్హతా వేటు పడింది.
దీంతో ఆయన మూడేళ్లపాటు పార్లమెంట్ ఉభయసభలకు, శాసనసభ, శాసన మండలికి పోటీ చేసే అర్హతను కోల్పోయినట్లు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. బలరాం నాయక్ 2009లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.
కాగా, మహబూబాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి వెంకటేశ్వరరావు, నల్గొండ నుంచి పోటీ చేసిన బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థి వెంకటేశ్, స్వతంత్ర అభ్యర్థి రొయ్యల శ్రీనివాసులు, మెదక్ నుంచి శివసేన తరఫున పోటీ చేసిన హన్మంతరెడ్డిలపై కూడా ఈసీ అనర్హత వేటు వేసింది.