మాజీ ప్రధాని కుటుంబాన్ని టార్గెట్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. కోట్లలో దోపిడీ!
దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. భారతదేశ 12వ ప్రధానమంత్రి దివంగత ఇందర్ కుమార్ గుజ్రాల్ కుమారుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నరేష్ గుజ్రాల్ కంపెనీని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కోట్ల రూపాయల మేర మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. జూన్ 12 నుంచి జూన్ 16, 2026 మధ్య ఈ మోసం జరిగినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. భారతదేశ 12వ ప్రధానమంత్రి దివంగత ఇందర్ కుమార్ గుజ్రాల్ కుమారుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నరేష్ గుజ్రాల్ కంపెనీని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కోట్ల రూపాయల మేర మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. జూన్ 12 నుంచి జూన్ 16, 2026 మధ్య ఈ మోసం జరిగినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అయితే సకాలంలో ఫిర్యాదు అందడంతో రూ.4 కోట్లకు పైగా నిధులను అధికారులు స్తంభింపజేయగలిగారు.
పోలీసుల వివరాల ప్రకారం, మోసగాళ్లు అత్యంత ప్రణాళికాబద్ధంగా ఈ నేరానికి పాల్పడ్డారు. ముందుగా వాట్సాప్‌లో నరేష్ గుజ్రాల్ పేరుతో, ఆయన ఫొటోను ప్రొఫైల్ పిక్చర్‌గా ఉపయోగిస్తూ నకిలీ ఖాతాను సృష్టించారు. అనంతరం ఆయన కంపెనీ ఆర్థిక వ్యవహారాలు చూసే సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని సందేశాలు పంపారు. అత్యవసరంగా కొంత మొత్తాన్ని నిర్దిష్ట బ్యాంకు ఖాతాలకు RTGS ద్వారా బదిలీ చేయాలని ఆదేశించారు.
ఆ సందేశాలు నేరుగా యజమాని నరేష్ గుజ్రాల్ నుంచే వచ్చినవిగా భావించిన ఉద్యోగి ఎలాంటి అనుమానం లేకుండా డబ్బు బదిలీలు చేశాడు. విచారణలో భాగంగా ఆ ఉద్యోగి గత నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు వేర్వేరు RTGS లావాదేవీల ద్వారా కోట్ల రూపాయలు బదిలీ చేసినట్లు వెల్లడించాడు. మొత్తం నష్టం రూ.7.8 కోట్లకు చేరిందని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో మరో కీలక విషయం కూడా బయటపడింది. భారీ మొత్తంలో నిధుల బదిలీ జరుగుతుండటంతో బ్యాంకు సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ను సంప్రదించింది. అయితే ఆ ఆదేశాలు నిజంగానే నరేష్ గుజ్రాల్ నుంచి వచ్చినవేనని భావించిన CFO లావాదేవీలను కొనసాగించాలని బ్యాంకుకు సూచించడంతో డబ్బు బదిలీలు పూర్తయ్యాయి.
మోసం జరిగిన విషయం గుర్తించిన వెంటనే ఢిల్లీ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసినట్లు నరేష్ గుజ్రాల్ తెలిపారు. ఫిర్యాదు అందుకున్న అధికారులు వెంటనే స్పందించి నిధుల మార్గాన్ని గుర్తించి, సుమారు రూ.4 కోట్లను స్తంభింపజేశారు. దీంతో మోసగాళ్లు ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోలేకపోయారు.
ఈ ఘటన ఢిల్లీలో నమోదైన అతిపెద్ద ఆర్థిక సైబర్ మోసాల్లో ఒకటిగా పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని, మోసగాళ్లను గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. సీనియర్ కార్పొరేట్ సంస్థలు కూడా ఇలాంటి సోషల్ ఇంజినీరింగ్ మోసాలకు బలవుతున్న నేపథ్యంలో, ప్రతి ఆర్థిక లావాదేవీకి ముందు బహుళస్థాయి ధృవీకరణ తప్పనిసరి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
