లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ (రిటైర్డ్) ఆర్కేఎస్ భదౌరియా బీజేపీలో చేరారు. మాజీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆదివారం (మార్చి 24) పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో బీజేపీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానుండగా, జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి.
ఆర్కేఎస్ భదౌరియా ఎయిర్ ఫోర్స్ చీఫ్ పదవి నుండి సెప్టెంబర్ 2021లో పదవీ విరమణ చేశారు. అతని స్థానంలో ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరిని ఎయిర్ ఫోర్స్ చీఫ్‌గా నియమించారు. భదౌరియా సెప్టెంబర్ 30, 2019 నుండి సెప్టెంబర్ 30, 2021 వరకు దేశ వైమానిక దళ చీఫ్‌గా ఉన్నారు. అతను ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలోని బహ్ తహసీల్ నివాసి అయిన భదౌరియా.. రాఫెల్ విమానాన్ని భారత్‌కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. విమానాల కోసం ఫ్రాన్స్‌తో చర్చలు జరుపుతున్న బృందానికి భదౌరియా నాయకత్వం వహించారు.
అయితే భదౌరియా బీజేపీలో చేరడం వెనుక పెద్ద కారణమే ఉందంటోంది నేషనల్ మీడియా. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లోక్‌సభ స్థానం నుండి భదౌరియాకు బీజేపీ టిక్కెట్ ఇవ్వవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం జనరల్ వీకే సింగ్ ఈ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఈ స్థానం నుంచి 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. బీజేపీ ఇప్పటివరకు విడుదల చేసిన నాలుగు అభ్యర్థుల జాబితాల్లో ఘజియాబాద్ అభ్యర్థి పేరును ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఆర్కేఎస్ భదౌరియాను ఈ స్థానం నుంచి బరిలోకి దింపవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
#WATCH | Former Chief of Air Staff, Air Chief Marshal (Retd.) RKS Bhadauria joins BJP in the presence of party General Secretary Vinod Tawde and Union Minister Anurag Thakur. pic.twitter.com/n3s9k7INmf
— ANI (@ANI) March 24, 2024
బీజేపీలో చేరిన తర్వాత ఎయిర్ చీఫ్ మార్షల్ (రిటైర్డ్) ఆర్‌కెఎస్ భదౌరియా మాట్లాడుతూ, “దేశ నిర్మాణానికి సహకరించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు పార్టీ నాయకత్వానికి మరోసారి ధన్యవాదాలు. నేను నాలుగు దశాబ్దాలకు పైగా భారత వైమానిక దళానికి సేవ చేశాను.” అయితే అత్యుత్తమమైనది, గత 8 ఏళ్లు బీజేపీ ప్రభుత్వ నాయకత్వంలో పనిచేసిన సమయం అని తెలిపారు.భారత సాయుధ బలగాలను బలోపేతం చేయడానికి, ఆధునీకరించడానికి, వాటిని స్వావలంబన చేయడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న కఠినమైన చర్యలు దళాలలో కొత్త సామర్థ్యాన్ని సృష్టించడమే కాకుండా వారికి కొత్త విశ్వాసాన్ని కూడా ఇచ్చాయన్నారు. మోదీ ప్రభుత్వ ఫలితాలు స్వావలంబనతో కూడిన చర్యలు క్షేత్రస్థాయిలో సత్పలితాలు ఇస్తున్నాయన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భద్రతా కోణం నుండి చాలా ముఖ్యమైనవి. ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని భదౌరియా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్ ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి మాజీ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఆర్‌కెఎస్ భదౌరియా నాయకత్వం వహించారు. ఆ సమయంలో ఆయన డిప్యూటీ ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఉన్నారు. RKS భదౌరియా నాయకత్వంలో, భారతదేశం – ఫ్రాన్స్ మధ్య అనేక అడ్డంకులను అధిగమించి రాఫెల్ విమానాల కోసం ఒప్పందం కుదిరింది. 2016 సెప్టెంబర్‌లో విమానాల ఒప్పందంపై సంతకాలు చేశారు. భదౌరియా సహకారానికి గుర్తింపుగా, అతని పేరు రెండు మొదటి అక్షరాలు, RB008, మొదటి రాఫెల్ తోకపై చేర్చింది భారత ఎయిర్‌ఫోర్స్.
ఇది మాత్రమే కాకుండా, స్వదేశీ తేజస్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) ప్రోగ్రామ్‌ను సిద్ధం చేయడంలో కూడా భదౌరియా ముఖ్యమైన పాత్ర పోషించారు. LCA ప్రాజెక్ట్‌పై నేషనల్ ఫ్లైట్ సెంటర్‌కి చీఫ్ టెస్ట్ పైలట్, ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పని చేశారు భదౌరియా. తేజస్‌లో ప్రారంభ నమూనా విమాన పరీక్షల్లో భదౌరియా కూడా పాల్గొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…