AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangster Release: పాలమూరు దళిత ఐఏఎస్ కృష్ణయ్య హత్యకేసు నిందితుడికి స్వేచ్ఛ.. నితీష్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో జైలు నుంచి..

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌‌లో నిరుపేద దళిత కుటుంబానికి చెందిన అత్యంత నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారి, జి.కృష్ణయ్యను దారుణంగా హత్యచేసిన కేసులో ఆనంద్ మోహన్‌కు శిక్ష పడింది. తాజాగా ఏప్రిల్ 26న జైలు నుంచి బయటకు రానున్నాడు. ఆనంద్ మోహన్‌తో పాటు, అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మరో బాహుబలి నేత రాజ్ బల్లభ్ యాదవ్‌తో సహా మరో 26 మంది వ్యక్తులు బీహార్ సర్కారు తాజా ఉత్తర్వులతో జైలు నుంచి విడుదల కానున్నారు.

Gangster Release: పాలమూరు దళిత ఐఏఎస్ కృష్ణయ్య హత్యకేసు నిందితుడికి స్వేచ్ఛ.. నితీష్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో జైలు నుంచి..
Anand Mohan Singh
Sanjay Kasula
|

Updated on: Apr 26, 2023 | 5:56 PM

Share

బిహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన గ్యాంగస్టర్ అతడు. రాజ్‌పుత్ కమ్యూనిటీకి చెందిన అతడు.. తెలుగు ఐఏఎస్ అధికారి హత్య కేసులో దోషిగా తేలడంతో మరణ శిక్ష పడింది. కానీ, దిగువ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేయడంతో మరణ శిక్ష కాస్తా జీవితఖైదుగా మారింది. ఈ హత్య కేసులో 14 ఏళ్ల నుంచి జైల్లోనే ఉన్నాడు. అయితే, బిహార్ ప్రభుత్వం జైలు నిబంధనలను సవరించడంతో అతడు త్వరలో విడుదల కాబోతున్నాడు. గ్యాంగస్టర్ కమ్ పొలిటీషియన్ బిహార్ స్ట్రాంగ్ మ్యాన్ ఆనంద్ మోహన్ సింగ్ 14 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదల కాబోతునున్నారు. ఓ హత్య కేసులో ఇప్పటికే 14 ఏళ్ల జైలు శిక్షను పూర్తి చేసుకున్న ఆనంద్ మోహన్ సింగ్ సత్ప్రవర్తన కారణంగా విడుదలవుతున్నారు.

ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆనంద్ మోహన్ సింగ్ సహా మరో 27 మంది ఖైదీలకు విముక్తి కలిగిస్తూ బీహార్ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జైలు నిబంధనలను నితీశ్ ప్రభుత్వం సవరించడంతో ఆనంద్ మోహన్ విడుదలకు మార్గం సుగమం అయ్యింది.

1994లో గోపాల్‌గంజ్ కలెక్టర్‌ జి.కృష్ణయ్యపై దాడికి ఆనంద్ మోహన్ రెచ్చగొట్టినట్టు నిర్దారణ కావడంతో 2007లో ట్రయల్ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. దీనిపై ఆయన పట్నా హైకోర్టులో అప్పీల్ చేయగా.. మరణశిక్షను యావజ్జీవిత ఖైదుగా మార్చింది. తనపై విధించిన జీవితఖైదును సవాల్ చేయగా.. 2012లో సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్ని సమర్ధించింది.

ప్రస్తుతం తన కుమారుడు, ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ వివాహం కోసం పెరోల్‌పై బయటకొచ్చిన ఆనంద్.. తాజా ఉత్తర్వులతో ఏప్రిల్ 25న తిరిగి జైలుకు వెళ్లనున్నారు. లాంఛనాలను పూర్తి చేసి ఏప్రిల్ 26న జైలు నుంచి బయటకు రానున్నారు. ఆనంద్ మోహన్‌తో పాటు, అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మరో బాహుబలి నేత రాజ్ బల్లభ్ యాదవ్‌తో సహా మరో 26 మంది వ్యక్తులు బీహార్ సర్కారు తాజా ఉత్తర్వులతో జైలు నుంచి విడుదల కానున్నారు.

విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగిని హత్య చేసిన దోషులకు జైలు శిక్షను మినహాయించడాన్ని నిషేధించిన నిబంధనను ఇటీవల బీహార్ ప్రభుత్వం తొలగించింది. అసలు 14 ఏళ్ల జైలు శిక్ష లేదా 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఖైదీల కోసం కొత్త నిబంధనలు ఉన్నాయని రాష్ట్ర న్యాయ శాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

‘ఏప్రిల్ 20 న బీహార్ శిక్షా ఉపశమన మండలి సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని 14 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన ఖైదీలను విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నాం’ అని నోటిఫికేషన్‌లో పేర్కొంది. కాగా, బిహార్ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు వివాదానికి ఆజ్యం పోస్తున్నాయి. ఇవి దళిత వ్యతిరేక నిబంధనలని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు.

‘‘తెలంగాణలోని మహబూబ్‌నగర్‌‌లో నిరుపేద దళిత కుటుంబానికి చెందిన అత్యంత నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారి, జి.కృష్ణయ్యను దారుణంగా హత్యచేసిన కేసులో నిబంధనలను మార్చి ఆనంద్‌ మోహన్‌ను విడుదల చేసేందుకు నితీష్‌ ప్రభుత్వం సిద్ధమైంది.. దేశం మొత్తం ప్రతికూల, దళిత వ్యతిరేక చర్యల గురించి చర్చించాలి’’ అని ట్వీట్ చేశారు. ఆనంద్ మోహన్ విడుదల దళితుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని, తన నిర్ణయాన్ని నితీశ్ పునరాలోచించుకోవాలని సూచించారు.

నితీశ్ కుమార్‌పై బీజేపీ కూడా విమర్శలు గుప్పించింది. ‘అధికారం కోసం ఒక క్రిమినల్ సిండికేట్‌పై మొగ్గు చూపుతున్న వ్యక్తి.. ప్రతిపక్ష నాయకుడిగా ఉండగలరా?’ అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయా ట్వీట్ చేశారు. ఈ విమర్శలను అధికార జేడీయూ తిప్పికొట్టింది. యూపీలో మాయవతి బీజేపీకి బీ-టీమ్ అని, నిబంధనలను సాధారణ ప్రజలను దృష్టిలో ఉంచుకుని రూపొందించామని జేడీయూ నేత రాజీవ్ రంజన్ సింగ్ కౌంటర్ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం