Google Data Centre: విశాఖలో గూగుల్‌ ఏఐ హబ్‌ ప్రారంభంపై నిర్మలమ్మ ఆసక్తికర ట్వీట్..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖలో గూగుల్‌ ఏఐ సిటీ ప్రారంభంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో గూగుల్‌ రాబోయే ఐదేళ్లలో రూ.80,000 కోట్ల వరకు పెట్టుబడి చేస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాల వల్ల భారత్‌ డిజిటల్‌ రంగంలో ప్రపంచ స్థాయిలో ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు.

Google Data Centre: విశాఖలో గూగుల్‌ ఏఐ హబ్‌ ప్రారంభంపై నిర్మలమ్మ ఆసక్తికర ట్వీట్..
Union Ministers Ashwini Vaishnaw and Nirmala Sitharaman with Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu and IT Minister Nara Lokesh with Google Cloud CEO Thomas Kurian

Updated on: Oct 14, 2025 | 2:54 PM

భారత టెక్నాలజీ రంగంలో మరో చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 1 గిగావాట్‌ సామర్థ్యం గల హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌‌ను ఏర్పాటు చేయడానికి గూగుల్‌ భారీ పెట్టుబడితో ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా దిల్లీలో జరిగిన ‘భారత్‌ ఏఐ శక్తి’ కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వేడుకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్, గూగుల్‌ క్లౌడ్‌ సీఈఓ థామస్‌ కురియన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్‌‌లో ఓ పోస్ట్ పెట్టారు. “దిల్లీలో జరిగిన #BharatAIShakti కార్యక్రమంలో గూగుల్‌ ఏఐ ప్రాజెక్టు ప్రారంభం ఒక చారిత్రక సందర్భం. విశాఖ ఏఐ సిటీలో 1 గిగావాట్‌ సామర్థ్యంతో కూడిన హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ క్యాంపస్‌ ప్రారంభమైంది. గూగుల్‌ రాబోయే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టుకు రూ. 80,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. ప్రధాని నరేంద్ర మోదీ గారి దూరదృష్టి విధానాల వల్ల భారత్‌ నేడు డిజిటల్‌ ఫౌంటెన్‌హెడ్‌గా అవతరించింది. ఇప్పుడు భారత్‌ ఏఐ, క్వాంటమ్‌ రంగాల్లో కూడా ప్రపంచానికి నాయకత్వం వహించబోతోంది. ఈ దిశగా సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ తీసుకున్న అద్భుతమైన ముందడుగు అభినందనీయం” ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టుతో విశాఖపట్నం ప్రపంచ టెక్‌ మ్యాప్‌పై కొత్త కేంద్రముగా నిలవనుంది. గూగుల్‌ ప్రతినిధులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఈ హబ్‌ ద్వారా 12 దేశాలకు సబ్‌సీ కేబుల్‌ కనెక్టివిటీ ఏర్పాటుచేస్తారు. ఇది భారత్‌లో డేటా భద్రత, క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, కృత్రిమ మేధ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీయనుంది. ‘వికసిత్ భారత్‌’ లక్ష్యాన్ని సాధించే దిశగా విశాఖలో గూగుల్‌ ఏఐ హబ్‌ మరో మహా మైలురాయిగా నిలవనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.