నూతనంగా ఏర్పడనున్న ఢిల్లీ అసెంబ్లీలో నేరచరిత్ర కలిగిన ఎమ్మెల్యేలు బోలెడుమంది అడుగు పెట్టబోతున్నారు. గత 2015 నాటి శాసన సభ్యులతో పోలిస్తే ఈ సారి వీరి సంఖ్య పెరిగింది. 70 సీట్లున్న అసెంబ్లీలో ఆప్ 62 సీట్లను గెలుచుకోగా.. 43 మంది ఆప్ ఎమ్మెల్యేలు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు తమ అఫిడవిట్లలో పేర్కొన్నారు. (ఇది 50 శాతమట).. తీవ్రమైన నేరాల్లో నిందితులుగా 37 మంది ఎమ్మెల్యేలున్నట్టు వెల్లడైంది. కాగా- వివిధ కేసుల్లో మహిళలపై అఘాయిత్యాలు , హత్య, హత్యాయత్నాలు, రేప్ వంటి నేరాలకు పాల్పడినట్టు వీరు అంగీకరించారు. అయితే 2015 లో 24మంది ఆప్ ఎమ్మెల్యేలు తాము నేరచరితులమని వివరించారు. (అప్పట్లో ఇది 34 శాతం).. అంటే అప్పటితో పోలిస్తే క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేల సంఖ్య ఈ సారి పెరిగిందని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ తన నివేదికలో తెలిపింది. అలాగే 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలలో ఐదుగురు తమపై క్రిమినల్ కేసులున్నట్టు వివరించారట. అటు-మూడో సారి ముఖ్యమంత్రి కానున్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై 13 కేసులున్నాయి. మరి.. ఈ కేసులేవో వెల్లడి కాలేదు. అలాగే ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో కరోడ్ పతీల సంఖ్య మునుపటికన్నా పెరిగిందని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ పేర్కొంది.