పండగ సీజన్ కావడానికి తోడు కరోనా ప్రభావం తగ్గడంతో ప్రయాణాలు ఊపందుకున్నాయి. దీంతో అక్టోబర్ నెలలో టోల్‌ప్లాజాల దగ్గర రికార్డు స్థాయిలో లావాదేవీలు జరిగాయి. ఈ క్రమంలో ఫాస్టాగ్ వసూళ్లు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా( ఎన్‌హెచ్‌ఏఐ) ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్‌లో మొత్తం రూ.3,356 కోట్ల ఫాస్టాగ్ వసూళ్లు నమోదయ్యాయి. ముఖ్యంగా శనివారం ఒక్కరోజే ఏకంగా రూ.122.81 కోట్ల ఫాస్టాగ్ వసూళ్లు వచ్చాయని.. ఇది ఆల్ టైం గరిష్టమని ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 15 అర్ధరాత్రి నుంచి జాతీయ రహదారుల్లోని టోల్ ప్లాజాల దగ్గర ఫాస్టాగ్ విధానం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వెంటనే కరోనా రెండో దశ ప్రారంభం కావడం, ఆర్థిక వ్యవస్థ తిరోగమించడం.. తదితర కారణాలతో ఫాస్టాగ్ వసూళ్లు తగ్గిపోయాయి. అయితే జులై నుంచి కొవిడ్ ప్రభావం తగ్గడంతో ప్రయాణాలు ఊపందుకున్నాయి. ఆర్థిక వ్యవస్థ కూడా క్రమంగా పుంజుకుంది. ఈ క్రమంలో ఆగస్టు నెలలో ఏకంగా రూ.3,076.56 కోట్లు ఫాస్టాగ్ ద్వారా వసూలు కాగా.. సెప్టెంబర్‌లో రూ.3000 కోట్లకు తగ్గిపోయింది. అయితే పండగల ప్రభావంతో అక్టోబర్‌లో ఏకంగా రూ.3,356 కోట్ల ఫాస్టాగ్ వసూళ్లు నమోదయ్యాయి.
Also Read: