Fastag, Paytm: గత ఏడాదిలో హైవేలలో టోల్ ప్లాజాల ద్వారా 2.6 లక్షల మంది ఫాస్టాగ్ వినియోగదారుల నుంచి తప్పుగా వసూలు చేసిన టోల్ ఛార్జీ రుసుమును తిరిగి చెల్లించడానికి పేటీఎమ్ తన వినియోగదారులకు సహాయపడింది. వాహనాన్ని తప్పుగా గుర్తించడం లేదా టోల్ ప్లాజాల పొరపాటుగా రెండు సార్లు ఛార్జ్ తీసుకోవడం లాంటి తప్పుడు వసూళ్లను త్వరగా తిరిగి వాహన యజమానులకు అందించడానికి జరిపే చెల్లింపులను సులభతరం చేసినట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ బుధవారం ప్రకటించింది. ఇందుకు గాను పేటీఎమ్ చెల్లింపుల సంస్థ వేగవంతమైన పరిష్కార యంత్రాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇది టోల్ ప్లాజాలలో జరిగే తప్పుడు చెల్లింపులను వెంటనే పసిగట్టి పరిష్కారం చూపుతుంది.
కాగా, ఫాస్టాగ్‌ల ద్వారా టోల్ ఛార్జీల ఆటోమేటిక్ చెల్లింపును నిర్ధారించేందుకు కొన్ని సార్లు టోల్ ప్లాజాల వద్ద ఉన్న సిస్టమ్స్, ప్రాసెస్‌లలో సమస్య కారణంగా అసలు ఛార్జీ కంటే అధికంగా వసూలుకు కారణమవుతున్నాయి. ఇలాంటి వాటిపై టోల్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపడుతోంది.
ఈ నేపథ్యంలో ఇటువంటి వినియోగదారుల ఫిర్యాదులన్నింటినీ త్వరితగతిన పరిష్కరించడానికి పీపీబీఎల్ (పేటీఎమ్ పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్) తన కస్టమర్ల ఫిర్యాదులు, అనుబంధ టోల్ లావాదేవీలు, టోల్ ప్లాజాలలో జరిగే సమస్యలను పూర్తిగా ఆడిట్ చేసే వివాదాలను నివారించే నిర్వహణ ప్రక్రియను ప్రవేశపెట్టింది. పేటీఎమ్ పేమెంట్స్ తన వినియోగదారుల తరపున ఇటువంటి 82 కేసులను పరిష్కరించింది.
కాగా, టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్స్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రతి వాహనానికి ఫాస్టాగ్స్ ఉండేలా చర్యలు చేపడుతోంది. నగదు రహితను ప్రోత్సహించేందుకు కేంద్రం మరిన్ని చర్యలు చేపడుతోంది. ఇటీవల కేంద్రం ఫాస్టాగ్స్‌ను ఉచితంగా అందిస్తామని కేంద్రం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వాహనదారులకు ఉచితంగానే ఫాస్టాగ్స్‌ను అందిస్తోంది.