FASTag Last Date And How To Buy It: దేశవ్యాప్తంగా ఉన్న టోల్‌గేట్ల వద్ద నగదు రహిత చెల్లింపులు జరపాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘ఫాస్టాగ్’ అనే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 2017 నుంచి ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఫాస్టాగ్ ద్వారా టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్‌ను తగ్గించడంతో పాటు, నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించనున్నారు. ఇదిలా ఉంటే గతంలో పలుసార్లు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని తేదీలను ప్రకటించింది. అయితే పలుసార్లు ఈ గడువును పెంచుతూ వచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 15ను డెడ్‌లైన్‌గా నిర్ణయించింది. ఆ తర్వాత ఫాస్టాగ్ లేకపోతే జాతీయ రహదారులపై వాహనాలు అనుమతివ్వరు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్న 720 టోల్ ఫ్లాజాల వద్ద ఫాస్టాగ్ సెంటర్‌లను ఏర్పాటు చేశారు.
ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయడానికి చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని అన్ని టోల్ ఫ్లాజాల వద్ద ఈ ఫాస్టాగ్‌ను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించారు. అంతేకాకుండా పేటీఎమ్ ద్వారా సొంతంగా మొబైల్ ఫోన్‌లోనే ఫాస్టాగ్ కొనుగోలు చేయొచ్చు. దీంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొటాక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలు కూడా ఫాస్టాగ్ కొనుగోలుకు అవకాశం కల్పించారు. ఫాస్టాగ్ కార్డులో వినియోగదారుడు అతనికి నచ్చిన మొత్తంలో రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ కార్డులో ఎప్పుడూ కనీసం రూ.150 ఉండేలా చూసుకోవాలి. ఇక ఫాస్టాగ్ పరిమితి కాలం విషయానికొస్తే.. జారీ చేసిన నాటి నంచి ఐదేళ్లు ఉంటుంది.