
ఒక కుటుంబం పూరీ జగన్నాథ ఆలయానికి చెందిన మహాప్రసాదాన్ని డైనింగ్ టేబుల్‌పై కూర్చోని తింటున్న వీడియో వివాదానికి దారితీసింది. పూరీ జగన్నాథుడికి సమర్పించబడిన పవిత్ర ఆహారం మహాప్రసాదం, దీనిని సాంప్రదాయకంగా నేలపై కూర్చొని వడ్డించి తింటారు. పూరీలోని ఒక బీచ్ రిసార్ట్‌లో డైనింగ్ టేబుల్ వద్ద పూజారి మహాప్రసాదం వడ్డిస్తుండగా పిల్లలతో సహా కనీసం 10 మంది కుటుంబ సభ్యులు తింటూ కనిపించారు. ఒక వ్యక్తి వారిని మహాప్రసాదం అలా తినకూడదు అని వారించారు. పూజారి మీరు అలా ఎందుకు వడ్డిస్తున్నారంటూ ప్రశ్నించాడు.
ఈ వీడియో వైరల్ అవ్వడంతో జగన్నాథ భక్తులలో ఆందోళనలు తలెత్తడంతో ఆలయ అధికారులు టేబుల్ వద్ద మహాప్రసాదం తినడం సంప్రదాయానికి విరుద్ధమని పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్నాథ ఆలయ అథారిటీ (SJTA) మహాప్రసాదం టేబుల్‌పై తింటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇది సంప్రదాయానికి విరుద్ధమని తెలిపింది. మహాప్రసాదం దైవికమైనది, నేలపై కూర్చుని తినాలి, ఆలయ శతాబ్దాల నాటి సంప్రదాయాలను కొనసాగించాలని భక్తులను అభ్యర్థిస్తూ ఆలయ కమిటీ పేర్కొంది.
“ఆలయం వైపు నుండి భగవంతుని దివ్య మహాప్రసాదాన్ని అన్నబ్రహ్మ రూపంలో పూజిస్తారని స్పష్టం చేయబడింది. నేలపై కూర్చుని మహాప్రసాదం తినే ఆచార సంప్రదాయం అనాది కాలం నుండి ఉంది. కాబట్టి, భక్తులందరూ డైనింగ్ టేబుల్ వద్ద మహాప్రసాదం తినడం వంటి సంప్రదాయానికి విరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని వినయంగా అభ్యర్థిస్తున్నాం” అని ప్రకటనలో పేర్కొన్నారు. స్థానికుల మనోభావాలు, మత విశ్వాసాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు పూరీలోని హోటళ్లలో అతిథులను ఇటువంటి సౌకర్యాలు అందించకుండా చూసుకోవాలని హెచ్చరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..