కరోనా వ్యాప్తి సమయంలో వేరియంట్ల గురించి, చికిత్స గురించి, వ్యాక్సిన్స్ గురించి రకరకాల ఫేక్ న్యూస్‌లు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి. వీటిలో నిజం ఏదో.. ఫేక్ ఏదో అర్థం కాక జనాలు కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. తాజాగా కరోనా విజేతలను ఫంగస్ టెన్షన్ వెంటాడుతున్న విషయం తెలిసిందే. తొలుత బ్లాక్… ఆ తర్వాత వైట్.. తాజాగా ఎల్లో ఫంగస్ గురించి.. అవి చేస్తోన్న డ్యామేజ్ గురించి మనం వార్తలు వింటున్నాం. అయితే ఇమ్యూనిటి పవర్ తక్కువగా ఉండటం, స్టెరాయిడ్స్ అధికంగా వాడటం వల్ల ఈ ఫంగస్‌ల ప్రమాదం అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయినా కానీ.. పలు వార్తలు బాధితులను ఆందోళనలో పడేస్తున్నాయి.
నల్లగా ఉండే ఉల్లిగడ్డల ద్వారా బ్లాక్‌ఫంగస్ వస్తోందని ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త ప్రచారమవుతోంది. దీంతో పాటు ఫ్రిజ్‌లో నల్లగా పేరుకుపోయిన ఫంగస్ వల్ల కూడా సోకే అవకాశముందని వాట్సాప్ లో మెస్సేజ్‌లు సర్కులేట్ అవుతున్నాయి. ఈ వార్తలపై స్పందించి ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా.. ఓ స్పష్టతనిచ్చారు. ఉల్లిగడ్డల ద్వారా బ్లాక్‌ఫంగస్ వస్తుందన్న వార్తలు పూర్తిగా అసత్యం అని కొట్టిపారేశారు. రిఫ్రిజిరేటర్‌లో నల్లగా పేరుకుపోయిన బ్యాక్టీరియా కూడా బ్లాక్ ఫంగస్‌కు కారణమవుతుందనేది అవాస్తమని చెప్పారు. ప్రజలు ఇటువంటి ఫేక్‌న్యూస్ నమ్మి భయపడొద్దని సూచించారు. కూరగాయలు, వస్తువుల ద్వారా బ్లాక్ ఫంగస్ రాదని వెల్లడించారు. ఉల్లిగడ్డలపై కనిపించే నల్లని పొర భూమిలో ఉండే ఫంగస్ వల్ల వస్తుందని… దాన్ని శుభ్రం చేసుకుని వాడుకుంటే ఎలాంటి నష్టం ఉండదని చెప్పారు.
Also Read: ఏపీలో మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగింపు.. నేడు లేదా రేపు సర్కార్ ఉత్తర్వులు !