ఎన్నికలు వచ్చాయంటే సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు ముందుకొస్తాయి. ఏ వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉంటే వారిని ఆకట్టుకోవడం కోసం ఏం చేయాలా అని అన్ని పార్టీలూ ఆలోచిస్తుంటాయి. త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి సమీకరణాలతో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు సమీపిస్తున్న వేళ ఈ పట్టణ రాష్ట్రంలో వర్గాలు, ప్రాంతాలవారిగా ఓటర్లను విభజించి ఆకట్టుకునే ప్రయత్నాలు సైతం ఊపందుకున్నాయి. ఇందులో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నవారు ఢిల్లీలో నివసిస్తున్న పూర్వాంచల్ వాసులు. నగర జనాభాలో 40 లక్షల మంది.. అంటే 24 శాతం ఈ ప్రాంతానికి చెందినవారేనని గణాంకాలు చెబుతున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో నివసించే సమూహం ఎటు మొగ్గుచూపితే అటు అధికారం కైవసమవుతుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు పూర్వాంచల్ అంటే ఏంటి.. ఆ ప్రాంతం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో ఢిల్లీలో ఎందుకు నివాసం ఉంటున్నారు.. గత ఎన్నికల్లో వారంతా ఏ పార్టీ వైపు మొగ్గుచూపారు.. వంటి అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.
హస్తినలో తూర్పు సంధ్యారాగం
హిందీలో ‘పూర్వ్’ అంటే తూర్పు అని అర్థం. పశ్చిమాన రాజస్థాన్, హర్యానా నుంచి తూర్పున బిహార్, జార్ఖండ్ వరకు హిందీ మాట్లాడే ప్రజలున్న భారతదేశంలో తూర్పు ప్రాంతాన్ని పూర్వాంచల్ అంటారు. ఇది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతాలు (గోరఖ్‌పూర్, వారణాసి)తో పాటు బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల వరకు విస్తరించి ఉంది. ఇక్కడి ప్రజలు హిందీలో ఓ ప్రత్యేక యాస (భోజ్‌పురి) మాట్లాడతారు. భాష మాత్రమే కాదు, ఆహార, సంస్కృతుల్లోనూ మిగతా ప్రాంతాలతో పోల్చితే భిన్నత్వం కనిపిస్తుంది. రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్ అంతటా గోధుమ ప్రధాన ఆహారం కాగా, పూర్వాంచల్ వాసులు మాత్రం వరి అన్నాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. మిగతా ప్రాంతాలతో సంబంధంలేని ప్రత్యేక పర్వదినాలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి.
సామాజిక, ఆర్థిక స్థితిగతుల ప్రకారం చూస్తే మిగతా దేశం కంటే ఈ ప్రాంతవాసుల్లో ఎక్కువ మంది దారిద్ర్యరేఖకు దిగువన కనిపిస్తారు. అందుకే దేశవ్యాప్తంగా పట్టణీకరణ వేగంగా జరుగుతున్న ప్రాంతాలకు వలసపోతూ ఉపాధి వెతుక్కుంటూ ఉంటారు. భవన నిర్మాణ కార్మికుల నుంచి డ్రైవర్లు, స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులు వంటి కింది స్థాయి ఉద్యోగాల్లో వీరు ఎక్కువగా కనిపిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలా ఉపాధి కోసం వచ్చి నివసిస్తున్న పూర్వాంచల్ వాసులు నగర జనాభాలో 4వ వంతు ఆక్రమించారు. అంటే ప్రతి నలుగురిలో ఒకరు ఈ ప్రాంతానికి చెందినవారని అర్థం. పూర్తిగా పట్టణ రాష్ట్రమైన ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా, వాటిలో 17 నుంచి 20 అసెంబ్లీ స్థానాల్లో పూర్వాంచల్ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంది. మరికొన్ని నియోజకవర్గాల్లో గణనీయంగా ఉంది.
పూర్వాంచలీలపై కన్నేసిన కమలదళం
ఢిల్లీలో వరుసగా రెండు పర్యాయాలు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) విజయం సాధించడం వెనుక పూర్వాంచల్ ఓటర్ల పాత్రే కీలకమని గ్రహించిన భారతీయ జనతా పార్టీ (BJP).. వారిని ఆకట్టుకోవడం కోసం వ్యూహాలు రచిస్తోంది. పేద, దిగువ మధ్యతరగతి జనాభా ఎక్కువగా ఉన్న పూర్వాంచల్ ఓటర్లు.. కేజ్రీవాల్ ప్రకటించే ఉచిత విద్యుత్తు, మెరుగైన ప్రభుత్వ పాఠశాలలు, మహల్లా క్లినిక్‌ల ద్వారా గల్లీల్లో లభించే వైద్యం వంటి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఆ పార్టీకి కొమ్ముకాస్తూ వచ్చారు. తమకు బలమైన ఓటుబ్యాంకుగా మారిన పూర్వాంచల్ ఓటర్లను జాబితా నుంచి తొలగించేలా బీజేపీ కుట్ర చేస్తోందంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్న కమలనాథులు.. పూర్వాంచల్ ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ఆ ప్రాంతానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రచారపర్వంలో రంగంలోకి దించుతున్నారు.
ఈ క్రమంలో భోజ్‌పురి గాయకుడు, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీతో పాటు బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని ఎన్నికల ప్రచారపర్వంలో ముందు వరుసలో నిలబెట్టింది. బిజెపి తన ఎన్‌డిఎ మిత్రపక్షాలు జెడియు మరియు ఎల్‌జెపికి కొన్ని సీట్లు ఇవ్వాలని కూడా ప్లాన్ చేసింది, తద్వారా బిహార్‌తో సంబంధం ఉన్న ఈ మిత్రపక్షాల కారణంగా పూర్వాంచలి ఓటర్లు బిజెపిలో చేరారు. బిజెపి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బీహార్ ఉప ముఖ్యమంత్రులను మాత్రమే కాకుండా, అరవింద్ కేజ్రీవాల్‌ను ఎదుర్కోవడానికి బీహార్ మరియు తూర్పు యుపి నుండి చాలా మంది సీనియర్ ఎంపీలు మరియు నాయకులను కూడా రంగంలోకి దింపుతోంది.
ఇదొక్కటే కాదు, బీజేపీ తమ పూర్వాంచల్ మోర్చాతో సహా అన్ని మోర్చాలకు పూర్వాంచల్ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రచార కార్యక్రమాలను అప్పగించింది. గతంలో నిర్వహించిన “చాయ్ పే చర్చ” (టీ తాగుతూ చర్చించడం) మాదిరిగా “లిట్టీ-చోఖా పే చర్చ” జరుపాలని సూచించింది. లిట్టి-చోఖా పూర్వాంచల్ ప్రాంతంలో పేరెన్నికగల వంటకం. హైదరాబాద్ బిర్యానీ, ఆగ్రా పేటా, దక్షిణదిన ఇడ్లీ తరహాలో లిట్టి చోఖా పూర్వాంచల్ ప్రాంతంలో ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ఇది ఎక్కడైనా కనిపించింది అంటే అక్కడ పూర్వాంచల్ వాసులు ఉన్నారని అర్థం. లిట్టీ-చోఖా మీద చర్చించడం ద్వారా ఆ ప్రాంత ఓటర్లను ఆకట్టుకోవచ్చన్నది కమలనాధుల వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో పాటు ఇదే మాదిరిగా ఓ డజను పథకాలను బీజేపీ అమలు చేయబోతోంది. ఈ కార్యక్రమాల్లో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన జాతీయ, ప్రాంతీయ స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రంగంలోకి 150 మందికి పైగా ఎంపీలు, ఎమ్మెల్యేలు
విజయానికి దారితీసే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదన్నది బీజేపీ విధానం. అందులో భాగంగా పూర్వాంచల్ ఓటర్లకు దగ్గరయ్యేందుకు “పూర్వాంచల్ స్వాభిమాన్ సమ్మేళనం”, పూర్వాంచల్ సాంస్కృతిక కమిటీ సంప్రదింపు ప్రచారం, “పూర్వాంచల్ సమాజ్ సంవాదం” వంటి కార్యక్రమాలలో 150 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మరియు 25,000 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు పాల్గొననున్నారు. అయితే ఈ కార్యక్రమాల కంటే ఈ సమాజానికి రాజకీయ భాగస్వామ్యం ఇవ్వడం ద్వారా మాత్రమే బీజేపీ లాభపడుతుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. అందుకే ఒక్కో బూత్‌లో కనీసం ఐదుగురు పూర్వాంచలి బీజేపీ నేతలు, కార్యకరతలను పార్టీ సిద్ధం చేస్తుంది.
అలాగే 1,200 సభలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. పూర్వాంచల్ ప్రాంతంలో పట్టున్న మిత్రపక్ష రాజకీయ పార్టీలు జనతాదళ్ (యునైటెడ్), లోక్‌జన్‌శక్తి పార్టీ (రాంవిలాస్ పాశ్వాన్) వంటి పార్టీలకు ఢిల్లీ అసెంబ్లీలో సీట్లు కేటాయించి పోటీ చేయించే ఆలోచనలో కూడా కమలనాథులు ఉన్నట్టు సమాచారం. ఇలా బహుముఖ వ్యూహంతో పూర్వాంచల్ ఓటర్లను ఆకట్టుకుని ఈ సారి ఎలాగైనా సరే ఢిల్లీ గద్దెపై కమలం జెండా ఎగరేయాలన్న కృతనిశ్చయంతో కాషాయ పార్టీ ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..