Supreme Court to Centre: ఆక్సిజన్‌ కొరతపై కేంద్రానికి సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌.. ముంబైని చూసి నేర్చుకోండంటూ హితవు

|

May 05, 2021 | 5:47 PM

ఢిల్లీలో ఆక్సిజన్‌ కొరతపై కేంద్రానికి సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌ విధించింది. ఢిల్లీకి 700 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను అందించాలని, దీనికి సంబంధించిన కార్యాచరణపై రేపు ఉదయం 10.30 గంటల లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Supreme Court to Centre: ఆక్సిజన్‌ కొరతపై కేంద్రానికి సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌.. ముంబైని చూసి నేర్చుకోండంటూ హితవు
Sc On Oxygen Crisis In Delhi
Follow us on

Supreme Court to Union Government: ఢిల్లీలో ఆక్సిజన్‌ కొరతపై కేంద్రానికి సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌ విధించింది. ఢిల్లీకి 700 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను అందించాలని, దీనికి సంబంధించిన కార్యాచరణపై రేపు ఉదయం 10.30 గంటల లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఆక్సిజన్‌ సరఫరాపై ఢిల్లీ హైకోర్టు కేంద్రంపై కోర్టు ధిక్కరణ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అధికారులను జైల్లో వేస్తే ఆక్సిజన్‌ సరఫరా చేయడం అసాధ్యమవుతుందని కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు విన్పించారు.

ఆక్సిజన్‌ సరఫరాపై తమ ఆదేశాలను అమలు చేయని అధికారులపై కోర్టు ధిక్కరణ కింద జైలుకు పంపిస్తామన్న ఢిల్లీ హైకోర్టు తీర్పుపై కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరోనా నియంత్రణపై కేంద్రం , ఢిల్లీ ప్రభుత్వం ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ముంబై కార్పొరేషన్‌ చర్యలను సుప్రీంకోర్టు ప్రశంసించింది. కోవిడ్ 19 విలయాన్ని ఎదుర్కొనడంలో ముంబై నగర పాలక సంస్థ అనుసరించిన విధానాలను సుప్రీంకోర్టు అభినందించింది. ముంబైలో అమలు చేసిన పద్ధతులను ఢిల్లీలో ప్రయత్నించి చూడాలని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ఆసుపత్రిలో పడకల ప్రాతిపదికపై ఆక్సిజన్ డిమాండ్‌ను లెక్కించడం శాస్త్రీయం కాదన్న సుప్రీంకోర్టు… కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కార నోటీసును నిలిపేసింది.

ఇదిలావుంటే, కోవిడ్ 19 మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఢిల్లీ నగరంలో ఆక్సిజన్ సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. నగరానికి ఆక్సిజన్ సరఫరాపై అంతకుముందు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవడంతో, కోర్టు ధిక్కార చర్యలు చేపడతామని, అధికారులు బుధవారం స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై బుధవారం విచారణ జరిపిన జస్టిస్ చంద్రచూడ్ నేత‌ృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఢిల్లీ నగరానికి ఆక్సిజన్ సరఫరాపై గురువారం ఉదయం 10.30 గంటలకు సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సవివరమైన ప్రణాళికను సమర్పించేందుకు ఈ గడువును ఇస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీలో కోవిడ్ 19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ముంబైలోని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అనుసరించిన విధానాలను పరిశీలించాలని అధికారులకు సూచించింది. కోర్టు ధిక్కార చర్యలు చేపట్టే అధికార పరిధిని వినియోగించడం వల్ల నగరంలోని సమస్యలు పరిష్కారం కాబోవని తెలిపింది.

మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీ అంతకంతకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో సతమతమవుతోంది. దీంతో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఢిల్లీకి రోజుకు సరిపడ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను దాదాపుగా సరఫరా చేయడానికి ప్రయత్నించాలని, ప్రస్తుతం సరఫరా చేస్తున్న 550 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరిపోదని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. రానున్న రోజుల్లో డిమాండ్‌కు తగినట్లుగా ఆక్సిజన్‌ను ఎలా సరఫరా చేస్తారో చెప్పాలని కోరింది. బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కోవిడ్ 19ను దీటుగా ఎదుర్కొందని సుప్రీంకోర్టు ప్రశంసించడంతో కేంద్ర ప్రభుత్వం ఏకీభవించింది. బీఎంసీ మెచ్చుకోదగిన కృషి చేసిందని కేంద్రం పేర్కొంది.

Read Also…  Covid-19 third wave: కరోనా థర్డ్ వేవ్ తప్పదా..? సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ సలహదారు..