భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)కు కొత్త భాగస్వామి దొరికింది. కర్ణాటకలో జనతాదళ్ (సెక్యులర్)తో పొత్తు పొడిచింది. ఢిల్లీలో ఈ మేరకు జరిగిన చర్చలు సానుకూలంగా సాగుతున్నట్టు తెలిసింది. ఏ నిష్పత్తిలో సీట్లు పంచుకోవాలన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు సాధించిన ఓట్ల శాతం ఆధారంగా సీట్ల పంపకాలు చేసుకోవాలన్న ఫార్ములాను జేడీ(ఎస్) ప్రతిపాదించినట్టు తెలిసింది. మొత్తంగా కొద్ది నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం చవిచూసిన రెండు పార్టీలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసి కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలని చూస్తున్నాయి. పొత్తులు ఖరారైనప్పటికీ.. సీట్ల పంపకాలపై మంతనాలు సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం జేడీ(ఎస్) వ్యవస్థాపకులు, మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడ మీడియా సమావేశం నిర్వహించినప్పటికీ పొత్తులపై సమాధానం దాటవేశారు. ఆ విషయం తన కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామి చూసుకుంటున్నారని చెప్పారు. కేంద్ర హోంమంత్రి, బీజేపీలో కీలక నేతగా ఉన్న అమిత్ షా తో జరిగే సమావేశంలో సీట్ల పంపకాలపై స్పష్టతరానుంది.
హిందీ మాట్లాడే ప్రజలున్న రాష్ట్రాల్లో జైత్రయాత్రలా సాగిపోతున్న కమలదళానికి దక్షిణాది రాష్ట్రాలు కొరుకుడుపడని కొయ్యలా మారాయి. దక్షిణాదిన ఉన్న 5 రాష్ట్రాల్లో నిన్న మొన్నటి వరకు అధికారం ఉన్న కర్ణాటక కూడా చేజారిపోవడంతో ప్రస్తుతం ‘బీజేపీ ముక్త్ సౌత్ ఇండియా’గా మారింది. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదంతో దేశం నలుమూలలా పాగా వేయాలని చూస్తున్న కాషాయ దళపతులకు దక్షిణ భారతదేశం ఒక సవాలుగా మారింది. ఇప్పటి వరకు సొంత బలం పెంచుకుని గెలుపొందాలని చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో.. ఒంటరి పోరాటానికి స్వస్తి చెప్పి ప్రాంతీయ పార్టీలతో పొత్తులకు సై అంటోంది. మోదీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా జట్టుకట్టిన ఇండి కూటమికి పోటీగా ఎన్డీఏ పేరుతో 38 పార్టీలను దరి చేర్చుకున్నప్పటికీ.. చెప్పుకోదగ్గ బలమైన ప్రాంతీయ పార్టీ కనిపించడం లేదు. గతంలో తెలుగుదేశం, శిరోమణి అకాలీదళ్, శివసేన, జనతాదళ్ (యునైటెడ్) వంటి బలమైన ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండేవి. కానీ వీటిలో శివసేన చీలికవర్గం మినహా మిగతా ఏ పార్టీ కూడా కూటమిలో లేకపోగా.. ఆ చీలికవర్గం బలం ఎంతన్నది ఎన్నికలు జరిగితే తప్ప తెలీదు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి బలమైన మిత్రపక్షం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో “ఎక్కడైతో పోగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలి” అన్న చందంగా ఓటమిపాలైన కర్ణాటక నుంచే బీజేపీ పొత్తుల ఆపరేషన్ మొదలుపెట్టింది.
జేడీ(ఎస్) అంటేనే దేవెగౌడ పరివారం. ఆ ఒక్క కుటుంబం చేతిలోనే మొత్తం అధికారం. బీజేపీతో పొత్తులపై చర్చల నేపథ్యంలో దేవెగౌడతో పాటు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన సోదరుడు రేవణ్ణ, మూడో తరం నేతలు ప్రజ్వల్ రేవణ్ణ, నిఖిల్ ఢిల్లీలోనే మకాం వేశారు. బీజేపీ హైకమాండ్‌తో గత కొద్ది రోజులుగా చర్చలు, మంతనాలు సాగించారు. సెప్టెంబర్ 21 (గురువారం) ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ లేన్‌లో ఉన్న దేవెగౌడ నివాసంలో కీలక సమావేశం జరిగింది. బీజేపీ తరపున చర్చల ప్రతినిధిగా వచ్చిన గోవా సీఎం ప్రమోద్ సావంత్ పొత్తుపై చర్చించారు. 6 లోక్‌సభ నియోజకవర్గాలపై కన్నేసిన జేడీఎస్.. కనీసం నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలను తమకు కేటాయించాలని పట్టుబట్టినట్టు తెలిసింది. మాండ్య, హాసన్, కోలార్, తుమకూరు స్థానాలను జేడీఎస్ డిమాండ్ చేస్తుండగా, తుమకూరు లోక్‌సభ నియోజకవర్గం ఇంకా ఖరారు కాలేదని పార్టీవర్గాలు చెబుతున్నాయి. బీజేపీతో జేడీ(ఎస్) పొత్తులు ఖరారు కావాలంటే ఆ పార్టీ అగ్రనేత అమిత్ షాతో తుది దశ చర్చలు జరగాల్సి ఉంది. ఆ తర్వాతే పొత్తుపై అధికారిక ప్రకటన ఉంటుంది. అందుకే సెప్టెంబర్ 22 (శుక్రవారం) ఉదయం 9.30కు దేవెగౌడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ పొత్తుల వ్యవహారం గురించి మాట్లాడలేదు. ఆ విషయం తన కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామి చూసుకుంటున్నారని దాటవేశారు. అయితే పొత్తుల కోసం అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు సాధించిన ఓట్ల శాతం ప్రాతిపదికన సీట్ల పంపకాలు చేసుకోవాలని రెండు పార్టీలు నిర్ణయించినట్టు తెలిసింది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 36.35% ఓట్లు రాగా, 2023లో 0.35% తగ్గి 36 శాతం ఓట్లు సాధించింది. అంటే దాదాపుగా గత ఎన్నికలతో సమానంగా ఓట్లు సాధించింది. కానీ సీట్లు మాత్రం సాధించలేకపోయింది. అందుకు కారణం.. జేడీ(ఎస్) ఓట్ల శాతం తగ్గి, ఆ మేరకు కాంగ్రెస్‌కు పెరగడమే. 2018లో 18.3 శాతం ఓట్లు సాధించిన జేడీ(ఎస్) 2023లో 13.29 శాతానికి పడిపోయింది. అంటే 5.01 శాతం ఓట్లు జేడీ(ఎస్) కోల్పోయింది. ఆ మేరకు కాంగ్రెస్ 2018తో పోల్చితే 2023లో 4.74 శాతం పెంచుకుంది. జేడీ(ఎస్) ప్రధానంగా దేవెగౌడకు చెందిన వొక్కళిగ సామాజికవర్గం ఓట్లపై ఆధారపడుతుంది. ఆ వర్గం ప్రజలు రాష్ట్రమంతటా లేరు. దక్షిణ కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో ఉండడంతో జేడీ(ఎస్) కూడా ఆ ప్రాంతంలోనే గెలుస్తూ వస్తోంది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే సామాజికవర్గానికి చెందిన నాటి కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ జేడీ(ఎస్) నుంచి ఓట్లను చీల్చగలిగారు. అది ఆ పార్టీకి అనూహ్యంగా కలిసొచ్చి 224 సీట్లలో 135 సీట్లు గెలుపొందేలా చేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేదు. హంగ్ ఫలితాలు రావడంతో తొలుత కాంగ్రెస్-జేడీ(ఎస్) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఎమ్మెల్యేలను చీల్చి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారం చేపట్టిన బీజేపీ.. బలాన్ని పెంచుకోలేకపోయింది.
అయితే అసెంబ్లీ ఫలితాలకు భిన్నంగా లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కాషాయదళానికి భారీ మద్దతు లభించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఏకంగా 51.38 శాతం ఓట్లు సాధించి, మొత్తం 28 లోక్‌సభ సీట్లలో 27 చోట్ల పోటీ చేసి 25 గెలుచుకుంది. జాతీయస్థాయిలో మోదీ నాయకత్వంపై ఉన్న నమ్మకమే ఇంతటి భారీ విజయానికి కారణమైంది. అయితే 2024లో కూడా ఇంత భారీ స్థాయిలో సీట్లు కైవసం చేసుకోవాలంటే పొత్తు అనివార్యమని కమలనాథులు భావిస్తున్నారు. జేడీ(ఎస్)తో కలిస్తేనే ఉభయ ప్రయోజనకారిగా ఉంటుందని, అందుకే ఈ పొత్తుల ఎత్తులు వేస్తున్నారని అర్థమవుతోంది.
ఓట్ల షేరింగ్ ఫార్ములాను బీజేపీ హైకమాండ్ ముందుంచేందుకు జేడీ(ఎస్) నేతలు సిద్ధమవుతున్నారు. 6 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల శాతం గణాంకాలను విశ్లేషించిన కుమారస్వామి.. బీజేపీ కంటే జేడీ(ఎస్) ఎక్కువ ఓట్లు సాధించిన తుమకూరు, హాసన్, మాండ్య, కోలార్, చిక్కబళ్లాపూర్, బెంగళూరు రూరల్ నియోజకవర్గాలను తమకే ఇవ్వాలని బీజేపీ నేతల ముందు ప్రతిపాదన పెట్టారు. అయితే బీజేపీ తరఫున చర్చల్లో పాల్గొన్న నేతలు మాత్రం 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను చూపుతూ.. అప్పుడు జేడీ(ఎస్) ఒక్క సీటు మాత్రమే గెలుచుకుందని గుర్తుచేసినట్టు తెలిసింది. సీట్ల పంపకాలపై స్పష్టత రావాలంటే బీజేపీ అధినేతలు రంగంలోకి దిగాల్సిందేనని, అమిత్ షాతో జరిగే సమావేశంలోనే స్పష్టత వస్తుందని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. సీట్ల పంపకాలు, సర్దుబాటుపై స్పష్టత వస్తే ఆ వెంటనే పొత్తులపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..