EPFO WhatsApp Service: ప్రావిడెంట్ ఫండ్ చందా దారులకు ఓ గుడ్‌న్యూస్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO) తాజాగా వాట్సాప్ హెల్ప్ లైన్‌నెంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఈపీఎఫ్‌ఓ కస్టమర్లు సులభంగా తమ సమస్యలను పరిష్కరిచుకునే అవకాశం ఉంటుంది. అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. ప్రతి చిన్న విషయానికి ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లకుండానే ఈ ఏర్పాట్లు చేసినట్లు సదరు సంస్థ ప్రకటించింది. ఇంతకు ముందే ఈపీఎఫ్‌ఓ ఫిర్యాదుల పరిష్కారం కోసం గ్రీవియన్స్ రిడ్రెస్సల్ ఫోరంను ప్రారంభించింది. ఇందులో భాగంగానే వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్‌ను ప్రకటించింది. అయితే ఇప్పటికే EPFIGMS, CPGRAMS పోర్టళ్లను ఈపీఎఫ్‌ఓ అందుబాటులోకి తెచ్చింది. ఇక ప్రత్యేకంగా 24×7 కాల్ సెంటర్ కూడా అందుబాటులో ఉంది. వీటికి అదనంగా మరో సేవలను అందుబాటులోకి తీసుకువస్తూ, వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్‌ను ప్రారంభించింది. ఈ సదుపాయం ద్వారా పీఎఫ్ చందాదారులు డిజిటల్ విధానంలో ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయాలను సంప్రదించవచ్చు. అవసరమైన సమాచారాన్ని నేరుగా పొందవచ్చు.
ఈపీఎఫ్‌ఓకు చెందిన మొత్తం 138 ప్రాంతీయ కార్యాలయాలలో వాట్సాప్ హెల్ప్ లైన్ సర్వీసులను ప్రారంభించింది. అయితే పీఎఫ్ కాంట్రిబూటర్లు ఇప్పుడు వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయం ఉంటుంది. ఇందుకు కస్టమర్లు ముందు EPFO వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. వెబ్ పేజీలో ప్రాంతీయ కార్యాలయాల వాట్సాప్ నంబర్లు కనిపిస్తాయి. సంబంధిత రీజినల్ ఆఫీస్ వాట్సాప్ నంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. పీఎఫ్ కాంట్రిబూషన్, ఇతర వివరాలకు సంబంధించిన సమాచారాన్ని చాట్ లిస్ట్‌లో టైప్ చేసి పంపించాలి. వివిధ రకాల సమస్యలను కూడా ఈ వాట్సాప్ నంబర్ల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకోవచ్చు.
కాగా, కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలు కూడా డిజిటల్ బాట పట్టాయి. వైరస్ భయంతో ఈపీఎఫ్‌ఓ కార్యాలయాలకు వెళ్లేందుకు కస్టమర్లు ఆసక్తి చూపించడం లేదు. దీంతో వివిధ మార్గాల్లో డైరెక్ట్ ఇంటరాక్షన్ కమ్యునికేషన్‌ను ఆ సంస్థ చందాదారులకు కల్పిస్తోంది. ఈ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఛానల్‌ను మరింత బలోపేతం చేసేందుకు వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్ ఎంతగానో ఉపయోగ పడనుంది. తాజాసేవలతో కస్టమర్లు తమ తమ ఇంటి నుంచే పీఎఫ్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈపీఎఫ్‌ఓ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫిర్యాదులు చేసుకోవచ్చు. అయితే ప్రస్తుత డిజిటల్ కాలంలో అన్ని రంగాలు కూడా ఇలాంటి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. గతంలో ఇలాంటి సదుపాయాలు లేకపోగా, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో వినియోగదారులకు సేవలను మరింత సులభతరం అయ్యేందుకు ఇలాంటి సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఏదైనా ఫిర్యాదు చేయాలంటే కార్యాలయానికి వెళ్లడం, సమయం వృధా అవుతుంది. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా ఇంటి నుంచే ఫిర్యాదులు, సేవల గురించి తెలుసుకునే విధంగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ ను పోగొట్టుకుంటే ఎలా దానిని ట్రేస్ చేయాలో తెలుసుకుందాం..!