Election Commission: ఈసీ సంచలన నిర్ణయం.. ఆధార్, మొబైల్‌తో ఓటరు ఐడీ లింక్ తప్పనిసరి..!
ఓటర్ల జాబితాలో అవకతవకలు, నకిలీ ఓటర్ కార్డులు, ఓటర్ల సంఖ్యలో పెరుగుదల, ఇష్టారాజ్యంగా ఓటర్ల తొలగింపు తదితర అంశాలపై విపక్షాలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.. ఇదే విషయంపై పార్లమెంట్ లో సైతం చర్చ జరిగింది.. ఈ క్రమంలో.. ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఓటర్ల జాబితాలో అవకతవకలు, నకిలీ ఓటర్ కార్డులు, ఓటర్ల సంఖ్యలో పెరుగుదల, ఇష్టారాజ్యంగా ఓటర్ల తొలగింపు తదితర అంశాలపై విపక్షాలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.. ఇదే విషయంపై పార్లమెంట్ లో సైతం చర్చ జరిగింది.. ఈ క్రమంలో.. ఓటర్ డేటాలో ఉన్న నకిలీ ఓటర్ నంబర్లకు సంబంధించి పలు పార్టీల ఆందోళనలపై చర్చించడానికి ఇటీవల ఎన్నికల సంఘం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్లను సక్రమంగా గుర్తించేందుకు ఓటర్ల జాబితాతో ఆధార్, ఫోన్ నంబర్లను అనుసంధానం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. ఎన్నికలను జాతీయ సేవ తొలి అడుగుగా అభివర్ణించిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్.. ఈసీఐ తన రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించడానికి ఏ మాత్రం వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. జనన, మరణాల నమోదు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు.
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ప్రధాన ఎన్నికల అధికారులకు (CEOలు) పంపిణీ చేసిన నోట్ ప్రకారం.. ఆధార్ నంబర్లను ఓటర్ల జాబితా డేటాతో అనుసంధానించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని భారత ఎన్నికల సంఘం (ECI) అధికారులను ఆదేశించిందని ఓ జాతీయ పత్రిక నివేదించింది.
ఇంటింటి సర్వేలు నిర్వహించేటప్పుడు బూత్ లెవల్ అధికారులందరూ రాజ్యాంగం ప్రకారం 18 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులను తప్పనిసరిగా ఓటర్లుగా నమోదు చేసుకునేలా చూడాలని సీఈసీ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఈనెల 4న నిర్వహించిన సీఈవోల కాన్ఫరెన్స్‌లో ‘ఓపెన్ రిమార్క్స్ ఆఫ్ సీఈసీ’ పేరిట సీఈవోలందరికీ పంపిణీ చేసిన పత్రాల్లోనూ అవే ఆదేశాలు ఉన్నాయని, ఆ ఆదేశాలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సర్క్యులేట్ చేయాలని సీఈవోలకు నిర్దేశించారని ఓ ఆంగ్ల ప్రత్రిక పేర్కొంది.
ఇదిలాఉంటే.. ఓటరు నమోదుకు ఆధార్ లింక్ తప్పనిసరి కాదని 2022లో సుప్రీంకోర్టుకు ఇచ్చిన వివరణలో ఈసీఐ స్పష్టం చేసింది. దానికి భిన్నంగా ఈ తాజా ఆదేశాలు ఉన్నాయి. 1960 ఓటర్ల నమోదు నిబంధనలకు 2022 సవరణకు సంబంధించిన కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టుకు కమిషన్ ఆధార్ అనుసంధానం కాదని నివేదించింది. 2022 లోని రూల్ 26 బి ప్రకారం, ఓటర్ల జాబితాలో జాబితా చేయబడిన వ్యక్తి ఫారం 6 బిని ఉపయోగించి “తన ఆధార్ సంఖ్యను” రిజిస్ట్రేషన్ అధికారికి తెలియజేయవచ్చని న్యాయ మంత్రి కిరణ్ రిజిజు ఇంతకు ముందు పార్లమెంటుకు తెలిపారు.
అయితే 2022 సవరణలను నోటిఫై చేసినప్పటి నుండి ఫారాలు మారలేదు. డూప్లికేట్ ఈపీఐసీల ద్వారా మోసం జరుగుతోందని పశ్చిమబెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించడంతో ఓటరు జాబితా పవిత్రత, నమోదు చర్చనీయాంశంగా మారింది. డూప్లికేషన్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సీఈఓలను కమిషన్ ఆదేశించింది.
మరోవైపు ఓటర్ల జాబితా ప్రక్షాళనలో పారదర్శకత పాటించాలని, డూప్లికేట్ ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నంబర్లను తొలగించాలని కోరుతూ మూడు రాజకీయ పార్టీలు ఈసీఐకి వినతిపత్రాలు సమర్పించాయి. వివిధ స్థాయిల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఏప్రిల్ 30లోగా సలహాలు ఇవ్వాలని ఈసీఐ అన్ని పార్టీలను కోరింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..