Population Control: దేశ జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. జన గణన విభాగం ఇటీవల విడుదల చేసిన గణాంకాల మేరకు దేశ జనాభా 133.89 కోట్లకు చేరింది. నిమిషానికి సగటున 51 మంది శిశువులు పుడుతుంటే 16 మంది కన్నుమూస్తున్నారు. అంటే నికరంగా దేశ జనాభాలో నిమిషానికి 35 మంది అదనంగా కలుస్తున్నారు. కేవలం 20 సంవత్సరాల వ్యవధిలోనే 118 శాతం అదనంగా జననాలు పెరిగాయి. 1999లో 1.22 కోట్ల మంది శశువులు జన్మించగా.. 2019లో 118శాతం పెరిగి 2.67 కోట్ల మంది జన్మించారు. ఈ నేపథ్యంలో దేశంలో జనాభా కట్టడికి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
ఇప్పటికే ఆ దిశగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ, అస్సాం చర్యలు చేపట్టాయి. పెరుగుతున్న జనాభా రాష్ట్రాభివృద్ధికి అవరోధంగా మారుతోందంటూ యూపీ ప్రభుత్వం గత నెల 2021-2030 పాపులేషన్ పాలసీని తీసుకొచ్చింది. అవసరమైతే దీని కోసం చట్టం చేసే యోచనలో ఉంది యోగి ఆదిత్యనాథ్ సర్కారు. ఈ చట్టం ఆమోదం పొందితే ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లల్ని కన్నవారు ప్రభుత్యోగానికి అర్హత కోల్పోనున్నారు. అలాగే ప్రభుత్వ సబ్సిడీలు, సంక్షేమ సౌకర్యాలు కోల్పోవాల్సి ఉంటుంది. అయితే యూపీ ప్రభుత్వం జనాభా నియంత్రణకు కాస్త కఠినమైన విధానాన్ని అవలంభించేందుకు సన్నద్ధంకావడంపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జనాభా నియంత్రణకు చట్టాలతో ఒత్తిడి తీసుకురావడం సరికాదన్న వాదన వినిపిస్తోంది.
బీహార్‌లోనూ అన్ని కులాలు, మతాలకు చెందిన వారు ఇద్దరికి మించి పిల్లలను కనకుండా చట్టం చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఖెమ్కా ఇటీవల డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన జేడీయు అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ జనాభా నియంత్రణపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాలిక విద్య, మహిళా స్వావలంభన జనాభా నియంత్రణ కోసం తమ ప్రభుత్వం ఎంచుకున్న మార్గమని పేర్కొన్నారు. ఈ దిశగా బీహార్‌లో తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు తగిన ఫలితాలు ఇస్తున్నట్లు చెప్పారు. బీహార్ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్రంలో హైస్కూల్, ఉన్నత చదవులకు వెళ్లే మహిళల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా పెరిగిందని..అదే స్థాయిలో శిశు జననాల సంఖ్య తగ్గుతున్నట్లు వివరించారు.
హై స్కూల్ కంటే ఎక్కువ చదువుకున్న మహిళలు తక్కువ మంది సంతానం కలిగి ఉన్నట్లు తాము గుర్తించామని..అందుకే బాలికల చదువుకు ప్రాధాన్యత ఇచ్చినట్లు నితీశ్ కుమార్ వివరించారు. జనాభా నియంత్రణ కోసం ఇదే విధానాన్ని కొనసాగిస్తామన్నారు. అదే సమయంలో జనాభా నియంత్రణ కోసం ఇతర రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై స్పందించబోనని ఆయన స్పష్టంచేశారు.
Also Read..
13 ఏళ్ల క్రితం ఒలింపిక్స్‌లో అద్భుతం.. తొలి స్వర్ణంతో భారత్‌ను మురిపించిన అభినవ్ బింద్రా
అదితినే కాదు మేము కూడా గోల్ఫ్ ఆడతాం అంటున్న ఎలుగుబంట్లు.. వీడియో వైరల్