ED summons Sonia and Rahul: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. 2015లో దర్యాప్తు సంస్థ మూసివేసిన నేషనల్ హెరాల్డ్ కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ మరియు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సమన్లు పంపింది.
కాగా, సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు జారీ చేయడంపై కాంగ్రెస్ నేతలు సీరియస్‌గా స్పందిస్తున్నారు. ‘‘రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టడానికి బీజేపీ తన చేతిలో కీలుబొమ్మలైన ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగిస్తోంది. ఈ కేసుపై న్యాయపరంగా, రాజకీయంగా పోరాడుతాం. 2015లోనే ఈడీ ఈ కేసును మూసివేసింది. రాజకీయ కక్ష సాధింపు, ప్రత్యర్థులను బెదిరించాలనే ఉద్ధేశ్యంతోనే ఈ కేసును మళ్లీ తెరపైకి తెచ్చారు.’’ అని కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి విమర్శించారు. 2105లో మూసివేసిన నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటిసులివ్వడం ద్వారా దేశంలో నెలకొన్న తీవ్రమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై అభిషేక్ సంఘ్వి ఆరోపించారు.