
దేశంలో ఓట్ చోరీ వ్యవహారం దుమారం రేపుతోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల సవరణ అంశంతోపాటు.. ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ జాబితా అంతా డొల్లతనమనీ విమర్శిస్తూ ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్‌లు, ప్రజెంటేషన్లు, వీడియోలతో రాహుల్‌గాంధీ ఎన్నికల సంఘంపై పలు ఆరోపణలు చేశారు. ఓట్లను దొంగిలిస్తున్నారని.. EC తమకు డిజిటల్ కాపీ ఇవ్వడం లేదనీ ఆరోపించారు. ఆధారాలు చూపాలనీ, ప్రమాణపత్రం ఇవ్వాలని EC ఛాలెంజ్ చేసినా.. రాహుల్ ఈ వ్యాఖ్యలపై వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలోనే.. భారత ఎన్నికల సంఘం SIR తోపాటు.. ఎన్నికల సంఘం పై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపడింది.. వారంతా భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారంటూ పేర్కొంది.
రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఓట్ చోరీ, ఎస్ఐఆర్ గురించి చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్ స్పందించారు.. ఆదివారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన జ్ఞానేష్ కుమార్.. ఓటర్లను తప్పుదారి పట్టించడానికి జరిగిన విఫల ప్రయత్నాలు.. రాజ్యాంగాన్ని అవమానించడం తప్ప మరేమీ కాదంటూ.. ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయ పార్టీల BLA ల సమక్షంలోనే ఓటర్ల జాబితా సవరణ జరిగిందన్నారు. ఆయా రాజకీయ పార్టీలు కావాలనే ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. SIR పై అసత్య ప్రచారం చేస్తున్నారు.. భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారంటూ జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. బిహార్ ఓటర్ల సవరణ అంశంపై వివరణ ఇచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్ దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందవచ్చన్నారు. ఎన్నికల సంఘానికి ఎలాంటి భేదభావాలు లేవు.. ఓటు హక్కు కోసం ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవచ్చు.. పౌరులు, పార్టీల మధ్య ఈసీ ఎలాంటి వివక్ష చూపించదంటూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలను మేం సమానంగా చూస్తాం.. బిహార్‌లో చేపట్టిన S.I.R విధానంలో అని పార్టీలను భాగస్వామ్యం చేశామన్నారు. కొందరు ఓట్ చోరీ పేరుతో అనవసర అనుమానాలు రేకెత్తిస్తున్నారు.. ఇది ముమ్మాటికీ రాజ్యాంగాన్ని అవమానించడమే అంటూ పేర్కొన్నారు.
నకిలీ పేర్లు – బహుళ ఎంట్రీలు ఉన్నాయని ఆరోపించిన కాంగ్రెస్ వంటి పార్టీలకు మెషిన్-రీడబుల్ ఓటరు జాబితాలు ఎందుకు ఇవ్వలేదో జ్ఞానేష్ కుమార్ ప్రత్యేకంగా మాట్లాడారు. “ఇది ఓటరు గోప్యతను ఉల్లంఘిస్తుందని సుప్రీంకోర్టు ఇప్పటికే 2019 లోనే చెప్పింది” అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, కొంతమంది ఓటర్లు బహుళ చోట్ల నమోదు చేసుకున్నారని కాంగ్రెస్ ఎంపీలు – ఇతరులు ఇటీవల చేసిన నివేదికలను ఆయన ప్రస్తావించారు.
#WATCH | Delhi: Chief Election Commissioner Gyanesh Kumar says, “…I want to make it clear that according to the Constitution of India, only Indian citizens can vote for the election of MP and MLA. People from other countries do not have the right. If such people have filled out… pic.twitter.com/egcPR1svaJ
— ANI (@ANI) August 17, 2025
“కొంతమంది ఓటర్ల చిత్రాలను వారి అనుమతి లేకుండా మీడియాకు చూపించారని.. వాటిని ఉపయోగించి ఆరోపణలు చేస్తున్నారని మేము ఇటీవల గమనించాము” అని ప్రధాన ఎన్నికల కమిషనర్ అన్నారు. డూప్లికేట్ లేదా ప్రాక్సీ ఓటింగ్ జరిగిందో లేదో తెలుసుకోవడానికి పోలింగ్ స్టేషన్ల నుండి నిఘా ఫుటేజ్‌లను కోరినట్లు తెలిపారు..
“ఎవరైనా ఒకరి తల్లి, కోడలు, సోదరి లేదా మరెవరికైనా ఉన్న సీసీటీవీ వీడియోలను ఎన్నికల సంఘం షేర్ చేయాలా?” అని జ్ఞానేష్ కుమార్ ప్రశ్నించారు. “ఓటరు జాబితాలో పేరు ఉన్న వ్యక్తులు మాత్రమే ఎన్నికల్లో ఓటు వేయగలరు” అని ఆయన అన్నారు.
దాదాపు 1.3 కోట్ల మంది ఎన్నికల అధికారులు, బూత్-లెవల్ ఏజెంట్లు, అభ్యర్థుల ప్రతినిధులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.. “ఇంత పారదర్శక ప్రక్రియలో ఎవరైనా ఓట్లను దొంగిలించగలరా?” అని వాదించారు. ప్రజలు రెండుసార్లు ఓటు వేశారనే ఆరోపణలకు మద్దతు ఇవ్వడానికి ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదని ఆయన అన్నారు.
“…భారత రాజ్యాంగం ప్రకారం, భారత పౌరులు మాత్రమే.. ఎంపీలు – ఎమ్మెల్యేల ఎన్నికలలో ఓటు వేయగలరని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఇతర దేశాల ప్రజలకు ఈ హక్కు లేదు. అలాంటి వ్యక్తులు లెక్కింపు ఫారమ్ నింపినట్లయితే, SIR ప్రక్రియ సమయంలో వారు కొన్ని పత్రాలను సమర్పించడం ద్వారా తమ జాతీయతను నిరూపించుకోవాలి. దర్యాప్తు తర్వాత వారి పేర్లు తొలగించబడతాయి” అని ఆయన అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..