‘దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా కనిపిస్తారు’.. కాంగ్రెస్ నేత శాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు

|

May 08, 2024 | 3:10 PM

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా చేసిన సంచలన వ్యాఖ్యలు మరో పెద్ద దుమారానికి దారి తీశాయి. ఇటీవల వారసత్వపు పన్నుపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారం సద్దుమణగక ముందే.. మరోసారి కాంట్రోవర్సీ కామెంట్స్‌తో ఇంటర్నెట్‌లో హాట్ డిబేట్‌కు తెరలేపారు.

దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా కనిపిస్తారు.. కాంగ్రెస్ నేత శాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు
Sam Pitroda
Follow us on

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా చేసిన సంచలన వ్యాఖ్యలు మరో పెద్ద దుమారానికి దారి తీశాయి. ఇటీవల వారసత్వపు పన్నుపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారం సద్దుమణగక ముందే.. మరోసారి కాంట్రోవర్సీ కామెంట్స్‌తో ఇంటర్నెట్‌లో హాట్ డిబేట్‌కు తెరలేపారు శాం పిట్రోడా. ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శాం పిట్రోడా జాతి వివక్షకు పాల్పడుతున్నారని దుయ్యబట్టింది. అలాగే ప్రధాని మోదీ సైతం ఈ కాంగ్రెస్ సీనియర్ నేత కామెంట్స్‌పై ధ్వజమెత్తారు. రూపురేఖలు, రంగును ఆధారంగా చేసుకుని దేశ ప్రజలను అవమానిస్తున్నారని మండిపడ్డారు.

‘ది స్టేట్స్‌మన్’ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన శాం పిట్రోడా.. భారతదేశం చాలా భిన్నమైన దేశమని పేర్కొన్నారు. అలాగే మన దేశం విభిన్న సంస్కృతులకు నిదర్శనం అని తెలిపారు. తూర్పు ప్రజలు చైనీయుల్లా.. పశ్చిమాన ఉన్న ప్రజలు అరబ్బులుగా కనిపిస్తారని, ఇక ఉత్తరాది ప్రజలు శ్వేతజాతీయులుగా.. దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్‌లుగా కనిపిస్తారని చెప్పారు. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ.. మనమందరం సోదరులు సోదరీమణులమని, ప్రతీ ఒక్కరి భాష, ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలు, సంస్కృతిని పరస్పరం గౌరవించుకుంటామని ఆయన అన్నారు.

మరోవైపు శాం పిట్రోడా వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. భారతీయుల రూపురేఖల ఆధారంగా ఆయన పోల్చిన తీరు జాతి వివక్షేనని ధ్వజమెత్తింది. విభజించి-పాలించు అనేది కాంగ్రెస్ సిద్దాంతమని బీజేపీ నేతలు మండిపడ్డారు. అయితే తాజాగా ఈ విమర్శలపై కాంగ్రెస్ స్పందించింది. అవన్నీ కూడా శాం పిట్రోడా వ్యక్తిగత అభిప్రాయమంటూ వివరణ ఇచ్చింది.