కొత్త డిజిటల్ చెల్లింపు విధానం ఈ-రూపీని లాంచ్ చేశారు ప్రధాని మోదీ. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రాల గవర్నర్లు కూడా హాజరయ్యారు. బ్యాంక్ ఖాతాలు , కార్డులు , యాప్‌లతో సంబంధం లేకుండా చెల్లింపులు చేసే విధంగా ఈరూపీని రూపొందించారు.
క్యూఆర్ కోడ్ , ఎస్‌ఎంఎస్‌లతో చెల్లింపులు చేసే విధంగా ఈ రూపీని రూపొందించారు. డిజిటల్ ఇండియాతో పాటు తాము చేపట్టిన పరిపాలన సంస్కరణలకు ఈ రూపీ నిదర్శనమన్నారు ప్రధాని మోదీ. ఈరూపీతో సులభతరంగా చెల్లింపులు చేయవచ్చన్నారు. ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా లావాదేవీలు చేసుకోవచ్చన్నారు . ఈ వ్యవస్థలో ఒక క్యూర్ కోడ్ లేదా ఎస్‌ఎంఎస్ స్ట్రింగ్ వోచర్‌లను లబ్ధిదారుడి మొబైల్ ఫోన్‌కి పంపిస్తారు. వీటినే ఇ-రుపీగా భావించవచ్చు. అందులో నిర్దేశిత డబ్బును ముందే లోడ్ చేసి పెడతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రీపెయిడ్ గిఫ్ట్ వోచర్ల లాంటివే. ఈ వోచర్ లేదా క్యూఆర్ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట అంటే సంబంధిత సేవలు అందేచోట వినియోగించుకోవచ్చు. దీనికి బ్యాంకు, యాప్, ఆన్‌లైన్ బ్యాంకింగ్.. వంటి మధ్యవర్తిత్వ వేదికలేవీ అవసరం లేదు.
ఈ వోచర్లను ఎలా జారీ చేస్తారు..
ఇ-రూపీ వ్యవస్థను అమలు చేసేందుకు కొన్ని కీలక బ్యాంకులు ముందుకు వచ్చాయి. మరికొన్ని బ్యాంకులు కూడా రానున్న రోజుల్లో వీటిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ వోచర్లు కావాల్సిన వారు సదరు బ్యాంకులను సంప్రదించాలి. ఫోన్ నంబరుతో సహా లబ్ధిదారుల వివరాలను వారికి అందజేయాలి. వోచర్ విలువ ఎంతో కూడా తెలియజేసి.. మొత్తం సొమ్మును చెల్లించాలి. అలాగే ఆ చెల్లింపులు ఎందుకోసం చేస్తున్నారో కూడా తెలియజేయాలి. అక్కడి నుంచి ఆ వోచర్లు అవి ఇస్తున్న వారి పేరు మీదుగా నేరుగా లబ్ధిదారుడికి చేరిపోతాయి.
ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఇవి ప్రయోజనకరంగా మారనున్నాయి. ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం లేనందున ఎలాంటి అవకతవకలకు అవకాశం ఉండదు. అలాగే ఆరోగ్యం, ఔషధాలకు సంబంధించిన సేవలను అందజేసేందుకు కూడా ఇవి ఉపయోగకరంగా ఉండనున్నాయి. మాతా-శిశు సంబంధిత, టీబీ నిర్మూలన, ఆయుష్మాన్ భారత్, పీఎం ఆరోగ్య యోజన, ఎరువుల రాయితీ.. వంటి పథకాల అమలు ఇ-రూపీ ద్వారా మరింత సమర్థంగా జరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల సంక్షేమం సహా ఇతర ప్రయోజనాలను అందించేందుకు ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు సైతం ఇ-రూపీని వినియోగించవచ్చని ప్రభుత్వం తెలిపింది.
Also Read:Woman Cop: దెబ్బ అదుర్స్.. రేపిస్ట్‌ను పట్టుకునేందుకు లేడీ ఎస్‌ఐ మాస్టర్ స్కెచ్..