జమ్ములో వైమానిక స్థావరంపై దాడి కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ ( NIA ) కు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనలో ఈ నెల 27వ తేదీన జమ్మూ వైమానిక స్థావరంపై బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు డ్రోన్లతో వైమానిక స్థావరంపై బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు.
జమ్మూ విమానాశ్రయంలోని వాయుసేన కార్యకలాపాలు నిర్వహించే స్థావరంలో పేలుడు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. శనివారం అర్ధరాత్రి దాటాక 1.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. తక్కువ ఎత్తులో ఎగురుతూ వచ్చిన రెండు డ్రోన్లు ఆరు నిమిషాల వ్యవధిలో వాయుసేన స్థావరం మీదకు పేలుడు పదార్థాలను (ఐఈడీ) జారవిడిచినట్టు అధికారులు తెలిపారు. తొలి బాంబు దాడిలో సత్వారీ ఏరియాలోని హై-సెక్యూరిటీ టెక్నికల్ ఏరియాలోని ఒక బిల్డింగ్ పైకప్పు దెబ్బతినగా, రెండో పేలుడు బహిరంగ ప్రదేశంలో జరిగినట్టు చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు వాయుసేన అధికారులు స్వల్పంగా గాయపడ్డట్టు చెప్పారు.