గుజరాత్, డిసెంబర్ 24: గుజరాత్ సమీపంలోని అరేబియా సముద్రంలో నౌకపై డ్రోన్ దాడి జరిగింది. పోర్‌బందర్ పోర్టుకు 220 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 19న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి బయల్దేరిన సరకు రవాణా నౌక.. డిసెంబర్ 25 నాటికి మంగుళూరు పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. అయితే డ్రోన్ దాడికి గురైన నౌకను కోస్ట్ గార్డ్ ముంబైకి దారిమళ్లించారు. డ్రోన్ దాడి తర్వాత నౌకలో మంటలు చెలరేగాయి. డ్రోన్ దాడి ఘటన వెనుక పాకిస్తాన్ హస్తం ఉండొచ్చన్న అనుమానిస్తున్నారు. నౌకలో మొత్తం 21 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 20 మంది భారతీయులు, ఒకరు వియత్నాం పౌరుడు ఉన్నారు. మంటలు అదుపులోకి వచ్చాయని, నౌకలోని సిబ్బంది అంతా క్షేమమని నేవీ అధికారులు ప్రకటించారు.
దాడి సమాచారం అందడంతో కోస్ట్‌గార్డు నౌక ఐసీజీఎస్ విక్రమ్‌ను రక్షణ శాఖ అధికారులు ఘటనా స్థలికి పంపారు. సమీప ప్రాంతాల్లోని అన్ని నౌకలను అలర్ట్ చేశామన్నారు. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ నౌక దెబ్బతిన్నదని .. నౌకను పరిశీలించి పెద్దగా ప్రమాదమేమీ లేదని తేల్చారు. నౌకను సురక్షితంగా తీరం చేర్చేందుకు కోస్ట్‌గార్డు గస్తీ నౌకలు బయలుదేరినట్టు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. తొలుత సముద్రపు దొంగలు (పైరేట్స్) దాడి చేసినట్లు కోస్ట్ గార్డ్ భావించారు. అయితే గుజరాత్ సమీపంలో సముద్రపు దొంగల జాడ లేదని, పాకిస్తాన్ సరిహద్దు జలాలు మాత్రమే ఉన్నాయని నిర్థరణకు వచ్చారు. దీంతో డ్రోన్ దాడి ఘటన వెనుక పాకిస్తాన్ హస్తం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.