
భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తూ, ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా హైదరాబాద్‌కు చెందిన డ్రోగో ఏరోస్పేస్ సంస్థ సరికొత్త రికార్డు సృష్టించింది. భారతీయ రక్షణ రంగానికి స్వదేశీ సాంకేతికత అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్న ఈ సంస్థం తాజాగా భారత సైన్యానికి 41 జేకే 250ఈ డ్రోన్లను అందజేసింది. మొత్తం రూ .72 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్‌లో మొదటి బ్యాచ్ డ్రోన్లను నాసిక్‌లో ఉన్న సథరన్ కమాండ్ అధికారులు అందజేసిన ఈ సంస్థ.. మిగిలిన డ్రోన్లను ఆగస్టు నాటికి పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకుంది. ఈ సంస్థ తొలి విడతతో విజయవంతగా డ్రోన్లను అందించడం.. సంస్థ అభివృద్ధితో పాటు దేశీయ రక్షణ తయారీ రంగంలో కూడా ఒక కీలక మైలురాయిగా నిలిచింది.
డ్రోన్ తయారీ సంస్థ నుండి ‘ఏరోస్పేస్ ఎకోసిస్టమ్’గా మార్పు
హైదరాబాద్‌లోని మాదాపూర్ కేంద్రంగా విజయవంతంగా పనిచేస్తున్న డ్రోగో డ్రోన్స్ సంస్థ, ఇటీవలే తన పేరును ‘డ్రోగో ఏరోస్పేస్’గా మార్చుకుంది. కేవలం డ్రోన్ల తయారీకే పరిమితం కాకుండా.. విమానాలు, ఉపగ్రహాలు, డ్రోన్లు, అంతరిక్ష నౌకల రూపకల్పన, తయారీ మరియు నిర్వహణకు తోడ్పడే సాంకేతిక, పారిశ్రామిక, పరిశోధనా కేంద్రంగా ఈ సంస్థ అభివృద్ధి చెందింది. రక్షణ, నిఘా, తదుపరి తరం మానవరహిత వైమానిక వ్యవస్థల అభివృద్ధిపై సంస్థ ప్రస్తుతం ప్రత్యేక దృష్టి సారించింది.
3 గంటల పాటు నిరంతర నిఘా
డ్రోగో ఏరోస్పేస్ తయారు చేసిన ఈ ఆధునిక డ్రోన్లు ఒకసారి ఛార్జింగ్ చేస్తే మూడు గంటల పాటు నిరంతరాయంగా ఆకాశంలో ఎగురుతాయి. ఇవి సరిహద్దుల్లో నిఘాకు, ఇతర వ్యూహాత్మక సైనిక అవసరాలకు ఎంతో ఉపయోగపడతాయని రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు.
రాజ్‌నాథ్ సింగ్, చంద్రబాబు ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి జిల్లాలో జరిగిన ‘రక్షణ ఉత్పత్తుల కేంద్రం, డ్రోన్ సిటీ’ శంఖుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో డ్రోగో ఏరోస్పేస్ తన ఉత్పత్తులను ప్రదర్శించింది. వీటిని పరిశీలించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు సంస్థ ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసించారు. డ్రోన్ల తయారీకి ఉపయోగించిన అత్యాధునిక సాంకేతికతను, సంస్థ సామర్థ్యాలను వారు అడిగి తెలుసుకున్నారు. స్వదేశీ సాంకేతికత ద్వారా భారత సాయుధ దళాలను బలోపేతం చేయడానికి డ్రోగో చేస్తున్న కృషిని వారు అభినందించారు.
దేశ సేవలో భాగమవ్వడం గర్వకారణం: సీఈఓ యశ్వంత్ బొంతు
ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ యశ్వంత్ బొంతు మాట్లాడుతూ.. దేశంలో ప్రముఖ స్వదేశీ ఏరోస్పేస్, రక్షణ సాంకేతిక సంస్థగా ఎదగడమే ‘డ్రోగో ఏరోస్పేస్’గా రూపాంతరం చెందడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. భారత సైన్యానికి తొలి విడతగా 41 జేకే 250ఈ డ్రోన్లను అందించడం మా సంస్థకు గర్వకారణం. ఇది మా సాంకేతిక నైపుణ్యం, తయారీ సామర్థ్యం, క్వాలిటీ స్టాండర్డ్స్‌కు నిదర్శనం. భవిష్యత్ రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరికొత్త రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేస్తూ, భారత రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం. అని తెలిపారు.
తెలంగాణలో రూపుదిద్దుకుంటున్న అధునాతన ప్లాంట్
సంస్థ విస్తరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (EMC) లో డ్రోగో ఏరోస్పేస్‌కు ఐదున్నర ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడ లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్త డ్రోన్ తయారీ కేంద్రాన్ని సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం సంస్థలో 300 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ఈ నూతన ప్లాంట్ ద్వారా మరో 500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఈఓ యశ్వంత్ బొంతు వెల్లడించారు.
అత్యాధునిక రక్షణ వ్యవస్థల అభివృద్ధిపై దృష్టి
డ్రోగో ఏరోస్పేస్ ప్రస్తుతం పలు అత్యాధునిక స్వదేశీ రక్షణ, ఏరోస్పేస్ ప్లాట్‌ఫారమ్‌ల అభివృద్ధిపై పని చేస్తోంది. వాటిలో లోయిటరింగ్ మ్యూనిషన్స్ (Loitering Munitions), దీర్ఘకాలిక సామర్థ్యం కలిగిన యూ ఏ వీ లు (Long-Endurance UAVs), కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత వైమానిక ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్‌లు, అధునాతన నిఘా, రికానైసెన్స్ వ్యవస్థలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన ఏరోస్పేస్ ఉత్పత్తులు ముఖ్యమైనవి. దేశ భద్రతా అవసరాలకు అనుగుణంగా స్వదేశీ సాంకేతికతతో రూపకల్పన చేసి, తయారు చేసిన పరిష్కారాలను అందించడం సంస్థ ప్రధాన లక్ష్యంగా పేర్కొంది.
భారత రక్షణ తయారీ రంగానికి బలమైన తోడ్పాటు
భారత ప్రభుత్వం స్వదేశీ రక్షణ ఉత్పత్తి, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, దేశీయ పరిశ్రమల ప్రోత్సాహంపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో డ్రోగో ఏరోస్పేస్ పురోగతి స్ఫూర్తిదాయకంగా నిలవనుంది. సంస్థ విజయాలు దేశ భద్రతను బలోపేతం చేయడమే కాకుండా, ఉపాధి అవకాశాల సృష్టి, సాంకేతిక ఆవిష్కరణలు, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి కూడా దోహదపడనున్నాయి. భారత సైన్యానికి సంబంధించిన కీలక ఆర్డర్‌ను విజయవంతంగా అమలు చేయడం ద్వారా డ్రోగో ఏరోస్పేస్, అత్యాధునిక మానవరహిత వైమానిక వ్యవస్థల రూపకల్పన, తయారీ , సరఫరా సామర్థ్యాలను నిరూపించుకుని, భారతదేశంలో ఎదుగుతున్న ప్రముఖ రక్షణ సాంకేతిక సంస్థలలో ఒకటిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.