Kerala: కొంచెం కూడా తేడా లేదు.. యాజిటీజ్ దృశ్యం సినిమా మాదిరిగానే మర్డర్.. ఆపై కొత్తగా కడుతున్న గోడలో

|

Oct 03, 2022 | 12:27 PM

వెంకటేశ్ , మీనా జంటగా నటించిన దృశ్యం సినిమా గుర్తుందిగా.. ఆ సినిమాలో లాంటి మర్డర్ రియల్‌గా కూడా వెలుగుచూసింది. ఈ దారుణ హత్య కేరళలో జరిగింది.

Kerala: కొంచెం కూడా తేడా లేదు.. యాజిటీజ్ దృశ్యం సినిమా మాదిరిగానే మర్డర్.. ఆపై కొత్తగా కడుతున్న గోడలో
Drishyam Model Murder
Follow us on

తుపాకీని అటూఇటూ గిరగిరా తిప్పి హీరోయిజాన్ని చాటుకోడానికే కాదు… నేరచరిత్రను తిరగరాసే ఘరానా పనులక్కూడా స్పూర్తినిస్తున్నాయి మన సినిమాలు. లేటెస్ట్‌గా స్నేహితుణ్ణే మర్డర్ చేసి, దృశ్యం సినిమా తరహాలో పూడ్చిపెట్టి… పోలీసుల కన్నుగప్పబోయాడో కాలాంతకుడు. కేరళలో జరిగిన ఈ తాజా ఖతర్నాక్ దృశ్యం… నేషనల్‌ లెవల్లో వైరల్ అవుతోంది. తమ కూతురి జీవితాన్ని నాశనం చెయ్యబోయిన వాణ్ణి చంపి పాతరేసినా ఫర్వాలేదనే భావాన్ని చెప్పే కుటుంబ కథాచిత్రమే దృశ్యం. తల్లీకూతుర్లిద్దరూ కలిసి ఆరుబయట గొయ్యి తవ్వి శవాన్ని పాతిపెడితే… ఆ తర్వాత దాన్ని ఏకంగా పోలీస్‌స్టేషన్‌ నేల మాళిగలోనే దాచిపెట్టి వెరీ ఇంటిలిజెంట్ అనిపించుకుంటాడు దృశ్యం హీరో. ఆవిధంగా సూపర్‌ సక్సెస్ అయింది దృశ్యం సినిమా.

అదే రీల్ సీన్‌ని రియాలిటీలోనూ ప్రయోగించబోయి… అడ్డంగా దొరికిపోయాడొక కేటుగాడు. కేరళలోని కొట్టాయం జిల్లాలో బిందుమోన్ అనే బీజేపీ కార్యకర్త నాలుగురోజుల నుంచి కనిపించడం లేదు. మిస్సింగ్ కేసు నమోదు చేసి వెతకడం మొదలుపెట్టారు పోలీసులు. మొబైల్ సిగ్నల్‌ ద్వారా ట్రేస్ చేసి చూస్తే.. ముత్తుకుమార్ అనే వ్యక్తి ఇంటినే చూపిస్తోంది. ఔట్‌హౌస్‌లో కొత్తగా కట్టినట్టున్న గోడను చూసి అనుమానించారు ఖాకీలు. ఆ గోడ కింద గొయ్యిని తవ్వితే బిందుమోన్ మృతదేహం కనిపించింది.

జరిగిందేంటని ఆరా తీస్తే… దృశ్యం సినిమా అరేడుసార్లు చూసిమరీ ఈ విధంగా మర్డర్‌ని ప్లాన్ చేసినట్లు తేలింది. నిందితుడు ముత్తుకుమార్… మృతుడు బిందుమోన్ ఇద్దరూ మంచి స్నేహితులవడం ఇక్కడ కొసమెరుపు. ప్రస్తుతం నిందితుడు ముత్తుకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. అతడు పాల్పడ్డ రియల్‌ దృశ్యం మాత్రం బాగా ట్రెండ్‌ అవుతోంది. కుటుంబ కలహాలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. “మేము అతన్ని డ్రింక్ తాగేందుకు పిలిచాము. ఆపై కొట్టి చంపాము. సంఘటన గురించి ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని నేలలో పాతిపెట్టి పైన కాంక్రీట్ వేశాం” అని ముత్తుకుమార్ పోలీసులకు చెప్పాడు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసుల గాలిస్తున్నారు.  కాగా, శవపరీక్ష అనంతరం బిందుమోన్ మృతదేహానికి ఆదివారం ఆయన ఇంటి ఆవరణలో అంత్యక్రియలు నిర్వహించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం