ముంబై, అక్టోబర్ 30: మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లోని ఓ డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టుగా సాగిస్తోన్న వ్యవహారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు చాకచక్యంగా ఛేదించారు. దాదాపు రూ.160 కోట్ల విలువైన 107 లీటర్ల లిక్విడ్ మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నట్లు ఆదివారం (అక్టోబర్ 29) ఓ ప్రకటనలో తెలిపారు. అపెక్స్ మెడికెమ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చెందిన రెండు ప్రాంతాల్లో శనివారం సోదాలు జరిపి సీజ్ చేసినట్లు తెలిపారు.
అక్టోబర్ 20న గుజరాత్‌కు చెందిన అహ్మద్‌బాద్ క్రైమ్ బ్రాంచ్ ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఒక ఫ్యాక్టరీపై దాడి చేసి, అక్రమ మార్కెట్‌లో రూ. 250 కోట్ల విలువైన మెఫెడ్రోన్, కెటామైన్, కొకైన్‌లను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దాడి తర్వాత ప్రారంభమైన తదుపరి విచారణలో తాజా దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింథటిక్ ఔషధాల వినియోగం, ఈ ఔషధాల తయారీలో పారిశ్రామిక యూనిట్ల దుర్వినియోగంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) దృష్టి సారించింది. దేశంలో మాదక ద్రవ్యాల ముప్పును ఎదుర్కోవడంలో ఇంటర్-ఏజెన్సీ సహకారం, ప్రాముఖ్యతను ఈ ఆపరేషన్ హైలైట్ చేస్తుంది. దీనిపై తదుపరి విచారణలో ఎన్‌డీపీఎస్ చట్టం నిబంధనల ప్రకారం కేసు కొనసాగుతుందని ఓ అధికారి తెలిపారు. కాగా అపెక్స్ మెడికెమ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రెండు ప్రాంతాల్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆదివారం జరిపిన దాడులు తీవ్ర చర్యకు దారి తీశాయి.
జమ్మూకశ్మీర్‌లో ఆదివారం ఓ పోలీసు అధికారిపై ఉగ్రకాల్పులు జరిపారు. ఇన్‌స్పెక్టర్ మన్సూర్ అహ్మద్ వనీ శ్రీనగర్ శివార్లలో ఈద్గా క్రీడాస్థలంలో క్రికెడ్ ఆడుతుండగా ఈ సంఘటన జరిగింది. లష్కరే తొయిబాకు చెందిన ఓ ఉగ్రవాది అతి సమీపం నుంచి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇన్‌స్పెక్టర్ మన్సూర్ అహ్మద్ వనీ శరీరంలోకి తూటాలు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ముష్కరుడిని బాసిత్ దార్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు ఏడీజీ విజయ్ కుమార్ మీడియాకు తెలిపారు.
మరిన్ని జాతీయ కథనాల కోసం క్లిక్ చేయండి.