Guruprasad Mohapatra: కరోనా సంక్షోభ సమయంలో ఆక్సిజన్ సరఫరాను పర్యవేక్షించిన డిపిఐఐటి కార్యదర్శి గురుప్రసాద్ మృతి, ప్రధాని మోదీ తీవ్ర సంతాపం

|

Jun 19, 2021 | 5:25 PM

కోవిడ్ సంక్షోభ సమయంలో ఆక్సిజన్ సరఫరాను పర్యవేక్షించిన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) కార్యదర్శి డాక్టర్ గురుప్రసాద్ మోహపాత్ర కన్నుమూశారు.

Guruprasad Mohapatra: కరోనా సంక్షోభ సమయంలో ఆక్సిజన్ సరఫరాను పర్యవేక్షించిన డిపిఐఐటి కార్యదర్శి గురుప్రసాద్ మృతి, ప్రధాని మోదీ తీవ్ర సంతాపం
Dpiit Secretary Dr.guruprasad Mohapatra
Follow us on

DPIIT Secretary Dr.Guruprasad Mohapatra: కోవిడ్ సంక్షోభ సమయంలో ఆక్సిజన్ సరఫరాను పర్యవేక్షించిన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) కార్యదర్శి డాక్టర్ గురుప్రసాద్ మోహపాత్ర కన్నుమూశారు. కోవిడ్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. సెకండ్ వేవ్ విజ‌ృంభిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరాను గురుప్రసాద్ పర్యవేక్షించారు. అయితే, ఇటీవల ఆయన కరోనా మహమ్మారి బారినపడి ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఆయన ఆరోగ్యం విషమించడంతో కన్నుమూసినట్లు ఎయిమ్స్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.


1986 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన మోహపాత్ర తొలుత గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. డీపీఐఐటీ కార్యదర్శిగా 2019 ఆగస్టులో బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ మోహపాత్రను కోల్పోయినందుకు బాధగా ఉందని, గుజరాత్‌లోనూ, కేంద్రంలోనూ ఆయనతో కలిసి పనిచేశానని ప్రధాని మోదీ ఒక ట్వీట్‌లో సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సేవలను ప్రధాని మోదీ కొనియాడారు. అడ్మినిస్ట్రేటివ్ అంశాలపై ఆయనకు చాలా గొప్ప అవగాహన ఉందని, పట్టుదలతో పనిచేయడం ఆయన ప్రత్యేకతని అన్నారు. మోహపాత్ర కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు తన సానుభూతిని తెలియజేస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నట్టు ట్వీట్‌లో తెలిపారు.

డీపీఐఐటీ కార్యదర్శిగా మోహపాత్ర బాధ్యతలు చేపట్టకముందు ఎయిర్‌ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్‌గా సేవలు అందించారు. వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా కూడా పని చేశారు. సెజ్‌ల ప్రమోషన్, పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ ప్రాజెక్ట్ ఎక్స్‌పోర్ట్స్ (ఫైనాన్సింగ్ అండ్ ఇన్సూరెన్స్) ప్రమోషన్ కోసం కృషి చేసినట్టు డీపీఐఐటీ ఒక ప్రకటనలో పేర్కొంది. రైల్వే మంత్రి పీయూష్ గోయల్, మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా మోహపాత్ర మృతికి సంతాపం తెలిపారు. దేశానికి ఆయన అందించిన సుదీర్ఘ సేవలు చిరకాలం నిలిచిపోతాయని పీయూష్ గోయల్ ట్వీట్ చేసారు.


ఒక సమర్ధుడైన అడ్మినిస్ట్రేటర్‌ను దేశం కోల్పోయిందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. గుజరాత్‌లో అర్బన్ డవలప్‌మెంట్ సంస్కరణలకు చేపట్టిన వారిలో ఆయనొక పయనీర్ అని, విలువైన సేవలందించారని గుర్తుచేసుకున్నారు. దేశంలో కోవిడ్ మేనేజిమెంట్‌ విషయంలోనూ డాక్టర్ మోహపాత్ర ముందున్నారని, గుజరాత్ ఆయన కర్మభూమి అయినప్పటికీ ఒక నిజమైన యుద్ధవీరుడిని ఒడిశా కోల్పోయిందని ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు.


కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా డాక్టర్ మోహపాత్ర మృతి తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంతో అంకితభావంతంతో పనిచేశారన్నారు. అతనికి కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పటికీ.. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరాను పర్యవేక్షించారని గౌబా పేర్కొన్నారు. ప్రజా సేవ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత తెలియజేస్తుంన్నారు.

Read Also…  TS Cabinet Meeting Live: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేత..