అభిజీత్ బెనర్జీ.. ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. భారత సంతతికి చెందిన ఈ ఆర్థిక వేత్త ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. ప్రపంచంలో పేదరిక నిర్మూలనపై తన సహచరులతో కలిసి చేసిన పరిశోధనలను గుర్తిస్తూ ఆయనకు నోబెల్ జ్యూరీ బహుమతిని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈయన గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలో ఆయన జీవితానికి సంబంధించిన మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈయన 10 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్నారు.
1983లో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌పై జేఎన్‌యూ వైస్ ఛాన్సలర్ వేటు వేయడంతో ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా కొంతమంది విద్యార్థులు ఘెరావ్ చేశారు. ఈ ఘటనలో పోలీసులు కొంతమంది విద్యార్థులను అరెస్ట్ చేసి.. తీహార్ జైలుకు పంపారు. వారిలో అభిజీత్ కూడా ఉండగా.. 10 రోజుల పాటు ఆయన అక్కడ జైలు జీవితం గడిపారు. దీనికి సంబంధించిన విషయాలను 2016లో ఆయన ఓ దినపత్రికతో పంచుకున్నారు.
‘‘10 రోజుల పాటు మమ్మల్ని జైలులో పెట్టిన పోలీసులు.. మమ్మల్ని చితకబాదారు. మాపై హత్యయత్నం కేసు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత భగవంతుడి దయ వలన పోలీసులు ఆ కేసును ఉపసంహరించుకున్నారు. ఇందుకు నేను భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాను. ఒకవేళ ఆ కేసు అలాగే ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.. 10 రోజులు కాదు.. తీహార్ జైల్లోనే ఇంకొన్ని రోజులు ఉండాల్సి వచ్చేది’’ అని అభిజీత్ తెలిపారు. ఇక ఆ రోజుల్లో పోలీసులకు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలవగా.. యూనివర్శిటీలో కమ్యూనిస్టు భావజాలాలున్న ఫ్యాకల్టీ కూడా సపోర్ట్ చేసిందని అభిజీత్ గుర్తుచేసుకున్నారు.
ఇక యూనివర్శిటీ క్యాంపస్‌లో తమదే అధికారం ఉండాలని తమ మాటే చెల్లుబాటు అయ్యేలా ఉండాలని నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందని అభిజీత్ తెలిపారు. యూనివర్శిటీ విద్యార్థులకు ఓ స్వర్గధామం అని దాన్ని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడం చాలా హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. తాము చెప్పిందే వేదమని అప్పట్లో విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేశారని అభిజీత్ ఓ సందర్భంలో వెల్లడించారు.