Vande Bharat: ఆగని వందే భారత్ దూకుడు.. ప్రయాణికుల సంఖ్యలో మరో అరుదైన ఘనత

వందే భారత్ రైళ్లకు దేశంలో అద్బుత స్పందన కనిపిస్తుంది. ఈ రైళ్లల్లో ప్రయాణించేందుకు ప్రజలు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. నెలలో లక్షల మంది ప్రయాణికులు వీటిల్లో ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య పరంగా వందే భారత్ రైళ్లు మరో ఘనత దక్కించుకున్నాయి. ఇప్పటివరకు ఎంతమంది ప్రయాణించారంటే..?

Vande Bharat: ఆగని వందే భారత్ దూకుడు.. ప్రయాణికుల సంఖ్యలో మరో అరుదైన ఘనత
Vande Bharat Train

Updated on: Dec 18, 2025 | 2:33 PM

దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే వందే భారత్ సర్వీసులను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దేశంలోని అన్ని ప్రధాన నగరాల గుండా నడుస్తున్న ఈ సర్వీసులు.. ప్రజలకు ఇప్పటికే సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. వీటి రాకతో లగ్జరీ ప్రయాణంతో పాటు వేగంగా గమ్యస్థానానికి చేరుకునే అవకాశం లభించింది. వందే భారత్ రాకతో ఇండియన్ రైల్వే స్వరూపమే పూర్తిగా మారిపోయింది. వీటి సక్సెస్‌తో త్వరలో వందే భారత్ స్లీపర్ సర్వీసులను కూడా రైల్వేశాఖ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది. కొత్త ఏడాదిలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును పాట్నా-ఢిల్లీ మధ్య ప్రవేశపెట్టాలని ఇప్పటికే రైల్వేశాఖ నిర్ణయించింది. వెయ్యి కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 8 గంటల్లో ఇది పూర్తి చేయనుంది. రాత్రుల్లో ప్రయాణం చేసేవారి కోసం స్లీపర్ సర్వీసులను తీసుకొస్తున్నారు.

ఇప్పటివరకు ఎంతమంది ప్రయాణించారంటే..

2019లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టగా.. దేశవ్యాప్తంగా ఇప్పటికి 164 సర్వీసులు నడుస్తున్నాయి. వీటి ద్వారా ఇప్పటివరకు 7.5 కోట్ల మంది ప్రయాణించారు. ఈ విషయాన్ని రైల్వేశాఖ అధికారికంగా ప్రకటించింది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యంతో నిర్మించిన ఈ రైళ్లతో ప్రయాణికులు వేగవంతమైన, సురక్షితవంతమైన ప్రయాణం చేస్తున్నారు. బయో వాక్యుమ్ టాయిలెట్లు, ఆటోమేటిక్ ప్లట్ డోర్లు, సీసీటీవీ వంటి ఆధునాతన సౌకర్యాలు వీటిల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 274 జిల్లాల్లో వందే ఈ రైళ్లు నడుస్తున్నాయి. బెంగళూరు-హైదరాబాద్, ఢిల్లీ-వారణాసి, శ్రీనగర్-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా మార్గంలోని నడుస్తున్న రైళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. దేశంలోని సాంస్కృతిక, ఆధ్యాత్మికత, ఆర్ధిక కేంద్రాలను వందే భారత్ రైళ్లు కలుపుతున్నాయి.

2019లో ప్రారంభం

2019లో ఒక రైలుతో వందే భారత్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు వాటి సంఖ్య 164కి చేరుకుంది. రోజూ వేలాదిమంది వీటి ద్వారా వేగవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అంతేకాకుండా ప్రయాణికులకు గౌరవప్రదమైన  ప్రయాణాన్ని అందిస్తున్నాయి.  త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు కూా దేశవ్యాప్తంగా అందుబాటులో రానున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.