అయ్యప్ప ప్రసాదంలో పెస్టిసైడ్స్.. వినడానికి కాస్త కఠినంగా ఉన్నా ఇది నిజం. శబరిమల అనగానే గుర్తుకొచ్చేది అరవణ ప్రసాదం. చిన్న చిన్న టిన్‌లో అయ్యప్ప భక్తులకు పంపిణీ చేస్తుంటారు. అయితే 2022-23 తీర్థయాత్ర సీజన్‌కు సిద్దం చేసిన ప్రసాదంలో మోతాదుకి మించి క్రిమి సంహారక మందులు ఉన్నట్టు తేలడం భక్తుల్ని షాక్‌కి గురిచేసింది. అవును.. ప్రసాదంలో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్టు ప్రచారం జరిగింది. దీనిపై అయ్యప్ప సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. న్యాయస్థానం ఆదేశాలతో అరవణ ప్రసాదాన్ని ల్యాబ్‌కి పంపించారు. ప్రసాదంలో వాడిన యాలకుల్లో 14 రకాల హానికర అవశేషాలు ఉన్నట్టు ల్యాబ్ రిపోర్ట్ తేల్చింది. దీంతో ఇక ఆ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయకుండా.. వాటిని డిస్పోజ్ చేయాలని కోర్టు ఆదేశించింది.
ప్రసాదంతో పాటు టిన్స్ డిమాలిష్ ప్రక్రియ బోర్డ్‌కి తలనొప్పి వ్యవహారంగా మారింది. బోర్డ్‌కి అయ్యే నష్టానికి సంబంధించిన డిటేయిల్స్ తెలుసుకుందాం. దాదాపు 6.65 లక్షల అరవణ ప్రసాదం టిన్లను డిస్పోజ్ చేయనున్నారు. ఈ అరవణ ప్రసాదం మొత్తం విలువ రూ.5.50 కోట్లు ఉండవచ్చని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు.
కాగా నిల్వ ఉన్న ప్రసాదాన్ని డిమాలిష్ చేసి దాన్ని ఎరువుగా మార్చబోతుంది దేవస్థానం బోర్డ్. ఇందుకోసం టెండర్లు పిలిచి.. ఆ ప్రక్రియను అప్పగించింది. ఆరున్నర కోట్ల విలువైన అరవణ ప్రసాదాన్ని ఎరువుగా మార్చి.. త్వరలోనే రైతుల కోసం వినియోగంలోకి తీసుకురాబోతుంది. ఇందుకోసం టెండర్లకు పిలవగా.. కేరళ కంపెనీ ఇండియన్ సెంట్రీఫ్యూజ్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ (ఐసీఈఎస్) దక్కించుకుంది. రూ. 1.16 కోట్లకు ఈ కాంట్రాక్ట్ ఫైనల్ అయింది రూ.5.50 కోట్లు విలువైన అరవణ ప్రసాదాన్ని ఎరువుగా మార్చి, రైతుల కోసం వినియోగంలోకి తెస్తామని ఐసీఈఎస్ తెలిపింది. కాగా మెటీరియల్‌ను ఎండబెట్టి, పశుగ్రాసం, ఎరువుగా మార్చడానికి హైదరాబాద్‌కు పంపనున్నారు.