
ఇప్పటి వరకు కుంభమేళాలో వ్యాపారం చేసుకుని కోట్లు సంపాదించిన వారున్నారు. కొందరు బొట్టు పెట్టి, మరికొందరు పూసలమ్మి ఇలా రోజుకొకరు నెట్టింట వైరలవుతున్నారు. నేనేం తక్కువా అనుకున్నాడేమో.. వారిని ఆదర్శంగా తీసుకుని ఓ యువకుడు తన స్టార్టప్ బిజినెస్ ను ప్రయాగ్ రాజ్ లో ప్రారంభించాడు. తన బిజినెస్ ఐడియాను చెబుతూ.. కుంభమేళాకు రాలేని వారికి బంపర్ ఆఫర్ అందించాడు. మహా కుంభమేళాకు హాజరు కాలేని వారు ‘డిజిటల్ ఫోటో స్నాన్’ సేవను ఎంచుకోవచ్చునని ఓ వీడియో రూపంలో తెలియజేశాడు.
భక్తులు తమ ఫొటోలను వాట్సాప్ ద్వారా తనకు పంపవచ్చని, వాటిని ప్రింట్ చేసి వారి తరపున సంగం పవిత్ర జలాల్లో ముంచుతానని గోయల్ తెలిపాడు. అతని స్టార్టప్ పేరును ప్రయాగ్ ఎంటర్‌ప్రైజెస్ గా తెలిపాడు. ఈ వర్చువల్ తీర్థయాత్ర అనుభవాన్ని రూ. 1,100 చెల్లించినవారికి అందిస్తామని.. 24 గంటల్లోపు ఆచారాన్ని పూర్తి చేస్తానని హామీ కూడా ఇస్తున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు పంచ్ డైలాగులతో విరుచుకుపడుతున్నారు.
వీడియో చూడండి
అక్కడ చైనా వాడు డీప్ సీక్ కనిపెడితే.. మనోడు డీప్ స్నాన్ కనిపెట్టాడు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 7 రోజుల్లోనే ఇతడి స్టార్టప్ బిలియన్ డాలర్ కంపెనీగా మారబోతుంది అంటూ మరో నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు. భక్తులపై నీకున్న ప్రేమను ఏమనాలో అర్థం కావట్లేదు భయ్యా అంటూ ఒకరు వ్యంగంగా స్పందించారు. మొత్తానికి ఈ బంపర్ ఆఫర్ ను వినియోగించుకునేందుకు భక్తులు ఏమేరకు పోటీ పడతారో చూడాలి మరి. ఈ మహా కుంభమేళాలో ఇప్పటివరకు వస్తువులు, సేవల ద్వారా రూ.3 లక్షల కోట్ల ( సుమారు 360 బిలియన్ డాలర్లు) విలువైన వ్యాపారాన్ని సృష్టిస్తుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) తాజాగా అంచనా వేసింది.