
కర్ణాటకను కుదిపేస్తున్న ధర్మస్థల సామూహిక ఖననాల కేసు సంక్లిష్టంగా మారుతోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక వ్యక్తి మాట మార్చగా, ఇప్పుడు మరో మహిళ చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో వందల మృతదేహాలు ఖననం చేశారంటూ సంచలన కేసు నమోదు అయింది. దీనికి తానే సాక్ష్యం అని..మృతదేహాలను చూపిస్తానంటూ భీయా అనే వ్యక్తి ముందుకు కూడా వచ్చారు.
రెండు దశాబ్దాల కాలంలో ధర్మస్థల వ్యాప్తంగా బహుళ హత్యలు, అత్యాచారాలు మరియు ఖననాలు జరిగాయనే ఆరోపణలను ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడే తోసిపుచ్చారు. ఆయన SIT దర్యాప్తును కూడా స్వాగతించారు. చెప్పినట్టుగానే పదహారు ప్రదేశాలకు తీసుకెళ్ళి తవ్వకాలు కూడా జరిపించారు. భీమా తీసుకెళ్ళిన ప్రతీ చోటా ప్రత్యేక దర్యాప్తు బృందం చీఫ్ ప్రణబ్ మొహంతి నేతృత్వంలోని అధికారులు తనిఖీలు చేశారు. అయితే ఒక్క చోట తప్ప మరెక్కడా మృతదేహాలు దొరకలేదు. దాంతో పాటూ ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. భీమా దెబ్బకే సిట్ అధికారులకు తల తిరిగింది. ఇప్పుడు అతనికి తోడు.. ధర్మస్థల అంశం తెరపైకి వచ్చిన తర్వాత తన కుమార్తె మిస్ అయిందంటూ వచ్చిన సుజాత కూడా ఇప్పుడు మాట మార్చింది.
సుజాతా భట్ అనే మహిళ ఇటీవల దక్షిణ కన్నడ పోలీసులను ఆశ్రయించారు. 2003లో తన కుమార్తె అనన్య భట్ స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వచ్చి కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టిన తరుణంలోనే, శుక్రవారం(ఆగస్టు 22) ఆమె తాను చెప్పిందంతా కట్టుకథేనని చెప్పింది. ఈ కట్టుకథ చెప్పడానికి గల కారణాన్ని కూడా సుజాత వివరించారు. “అనన్య భట్ పేరుతో తనకు కుమార్తె లేదు. ఆ ఫొటోలు కూడా సృష్టించినవే. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రముఖులు తనతో ఈ అబద్ధం చెప్పించారు” అని ఆమె వెల్లడించారు.
ధర్మస్థలలో వందల మృతదేహాలను పూడ్చిపెట్టానని గతంలో భీమా అనే పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపించాడు. ఇప్పటి వరకూ తానే ప్రత్యక్ష సాక్షి అంటూ వచ్చిన భీమా మాట మార్చారు. తనకు ఒకరు పుర్రె ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వమన్నారని, న్యాయస్థానంలో పిటిషన్ కూడా వారే వేయించారని చెప్పడంతో ఈ కేసు దర్యాప్తు అధికారులకు సవాలుగా మారింది. ఇప్పుడు సుజాతా భట్ యూటర్న్‌తో ఈ వ్యవహారం మరింత ఉత్కంఠ రేపుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..