ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్‌లో పగుళ్లు వచ్చిన ఇళ్లు , భవనాల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటివరకు 863 ఇళ్లకు భారీ పగుళ్లు వచ్చినట్టు గుర్తించారు. అందులో 181 ఇళ్లు అత్యంత ప్రమాదకరంగా మారాయని , ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదముందని NDMA అధికారులు ప్రకటించారు. ఇప్పటికే వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాత్కాలికంగా వాళ్లకు క్యాంప్‌ల్లో ఆశ్రయం కల్పించారు. ఉత్తరాఖండ్ మార్కింగ్ చేసిన భవనాల కూల్చివేత కొనసాగుతోంది. తొలుత రెండు హోటళ్లను కూల్చేసిన అధికారులు ఇప్పుడు ఇళ్ళను కూడా కూల్చేస్తున్నారు. చార్‌థామ్‌కు ముప్పుగా ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలని సాధువులు , సంతువులు డిమాండ్ చేస్తున్నారు.
పవిత్రమైన జోషిమఠ్ కుంగిపోయినట్టు ఇస్రో శాటిలైట్ చిత్రాలు కూడా స్పష్టం చేశాయి. హిమపాతం, చలితీవ్రత పెరగడంతో కూల్చివేతలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. క్యాంప్‌ల్లో ఉన్న జనం ప్రతికూల వాతావరణంతో అష్టకష్టాలు పడుతున్నారు. ఇక్కడి జెపి కాలనీ దగ్గర నీటి విడుదల 136 ఎల్‌పిఎమ్‌లకు తగ్గిందని అధికారులు తెలిపారు. సముద్రమట్టానికి 6000 అడుగుల ఎత్తులో ఉంటుంది జోషిమఠ్. ప్రస్తుతం భూమి కుంగుతున్న తీరు చూస్తుంటే కొన్ని రోజుల్లోనే ఈ ఊరు మట్టిలో కలిసిపోతుందని ఆందోళన చెందుతున్నారు ఇక్కడి ప్రజలు. ఇలాంటి పరిస్థితి వస్తుందని దాదాపు 50 ఏళ్లు క్రితమే నిపుణులు హెచ్చరించారు. ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టిన ఫలితం – నేడుఈ దుస్థితి.
మరోవైపు ఉత్తరాఖండ్ లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వణికించాయి. పితోర్‌ఘడ్‌లో భూకంప తీవ్ర 3.8గా నమోదయ్యింది. ఇప్పటికే ఇళ్లకు పగుళ్లతో భయపడుతున్న జనం తాజా భూప్రకంపనలతో మరింత భయపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..