
ఢిల్లీలోని ఎర్రకోట గేట్ నంబర్ 1 దగ్గర జరిగిన పేలుడుపై చైనా మంగళవారం (నవంబర్ 11, 2025) తొలిసారి స్పందించింది. పేలుడు పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన చైనా, “ఢిల్లీలో జరిగిన సంఘటనతో మేము దిగ్భ్రాంతి చెందాము” అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ అన్నారు. మృతులు, గాయపడిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ఈ సంఘటనలో చైనా పౌరులెవరూ గాయపడలేదని ఆయన అన్నారు.
భారతదేశంలోని చైనా రాయబారి జు ఫీహాంగ్ కూడా ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడు మృతులకు సంతాపం తెలిపారు. సోమవారం సాయంత్రం (నవంబర్ 10) జరిగిన ఈ పేలుడులో 12 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. “ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడు నాకు బాధ కలిగించింది. బాధితులకు ప్రగాఢ సానుభూతి” అని జు ఫీహాంగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
అలాగే, భారతదేశంలోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, దర్యాప్తులో పేలుడుకు గల కారణాలు వెల్లడవుతాయని అన్నారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, “ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుతో షాక్ అయ్యాను. జరుగుతున్న సమగ్ర దర్యాప్తులో సంఘటనకు గల కారణాలు వెల్లడవుతాయని మేము విశ్వసిస్తున్నాము. బాధితుల కుటుంబాలకు మా సంతాపం తెలియజేస్తున్నాము, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము” అని ఆయన పేర్కొన్నారు.
పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. “ఈ సంఘటన విషాదకరం. ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నాము. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము” అని అమెరికా విదేశాంగ శాఖ దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల బ్యూరో ట్విట్టర్‌లో పేర్కొంది.
ఢిల్లీ పేలుడుపై శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ కూడా విచారం వ్యక్తం చేశాయి. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే మాట్లాడుతూ, “ఢిల్లీలో జరిగిన పేలుడు వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత ప్రజలకు శ్రీలంక సంఘీభావం తెలుపుతోంది. బాధిత వారందరికీ మా సంతాపం తెలియజేస్తున్నాము” అని అన్నారు.
ఈ పేలుడులో ప్రాణనష్టం తనను తీవ్రంగా బాధపెట్టిందని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు అన్నారు. ఆయన ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. “దుఃఖంలో ఉన్న కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. ఈ క్లిష్ట సమయంలో మాల్దీవులు భారత ప్రజలకు, భారత ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నాయి.” అని పేర్కొన్నారు.
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడును భారతదేశంలోని సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ ఉగ్రవాద దాడిగా అభివర్ణించారు. “ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు దాడిలో బాధితులు, వారి కుటుంబాలకు నా ప్రార్థనలు. సింగపూర్ ఈ ఉగ్రవాద సంఘటనను ఖండిస్తోంది” అని సైమన్ వాంగ్ అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..