Mobile Jammer: దీపావళి వేళ ఢిల్లీలో చైనీస్ మొబైల్ జామర్ల గుర్తింపు.. ఇవీ ఎంత డేంజరో తెలుసా?

|

Oct 27, 2024 | 6:38 PM

చైనా మొబైల్‌ జామర్ల గుర్తింపుతో దేశ రాజధానిలో కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీలో పెను ముప్పును తలపెట్టేందుకు కుట్ర జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Mobile Jammer: దీపావళి వేళ ఢిల్లీలో చైనీస్ మొబైల్ జామర్ల గుర్తింపు.. ఇవీ ఎంత డేంజరో తెలుసా?
Mobile Jammer
Follow us on

దీపావళి పండుగ వేళ దేశ రాజధానిలో తీవ్ర కలకలం రేగింది. ఆదివారం(అక్టోబర్ 27) నాడు, ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్ పెద్ద కుట్ర బహిర్గతం అయ్యింది. భద్రతాపరమైన ముందుజాగ్రత్తగా తనిఖీలు చేపట్టిన పోలీసులకు షాకింగ్ వస్తువులను గుర్తించారు సుప్రసిద్ధ పాలికా మార్కెట్ నుండి 2 చైనీస్ మొబైల్ జామర్‌లను గుర్తించారు. భద్రతా కోణంలో స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఢిల్లీలోని పాలికా బజార్‌లో రెండు చైనీస్ మొబైల్ జామర్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ జామర్ సామర్థ్యం 50 మీటర్లు. షాపు యజమాని రవి మాథుర్‌ను అరెస్టు చేశారు. ఈ జామర్‌ను లజపతిరాయ్‌ మార్కెట్‌ నుంచి రూ.25 వేలకు తీసుకొచ్చానని, ఎక్కువ ధరకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నానని రవి చెప్పాడు. అటువంటి జామర్‌లను విక్రయించడానికి, లైసెన్స్ కానీ, అవసరమైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇలాంటి వస్తువులను విక్రయించడానికి కేంద్రం కేబినెట్ సెక్రటేరియట్ మార్గదర్శకాలను రూపొందించింది. దీని ప్రకారం ఈ జామర్‌ను ఎవరూ విక్రయించడానికి వీలులేరు.

ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు టెలికమ్యూనికేషన్ విభాగానికి తెలియజేశారు. ఇప్పుడు ఢిల్లీలోని ఇతర మార్కెట్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో మిస్టరీ పేలుడు జరిగింది. ఈ రకమైన జామర్‌ను ఉపయోగించడం ద్వారా ఘాతుకానికి పాల్పడ్డారు. ఎవరైనా అలాంటి సంఘటనను నిర్వహించడానికి కమ్యూనికేషన్‌కు అంతరాయం కలిగించవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఇదిలావుంటే, ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ స్కూల్ సమీపంలో బాంబు పేలుడు కేసులో ఆరుగురిని అనుమానితులుగా పోలీసులు గుర్తించారు. ఘటనకు ముందు వారంతా పేలుడు జరిగిన ప్రాంతానికి వెళ్లారు. పేలుడు ఖచ్చితమైన స్వభావాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రస్తుతం ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 100 మందిని విచారించామని పోలీసులు తెలిపారు.

కాగా, చైనా మొబైల్‌ జామర్ల గుర్తింపుతో దేశ రాజధానిలో కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీలో పెను ముప్పును తలపెట్టేందుకు కుట్ర జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పాలికా బజార్ మార్కెట్లో దొరికి చైనీస్ మొబైల్ జామర్ల అత్యంత ప్రమాదకరమని పోలీసులు భావిస్తున్నారు. 50 మీటర్ల దూరం వరకు మొబైల్ సిగ్నళ్లను జామ్ చేయగల సామర్థ్యం వీటి సొంతం. విద్రోహ శక్తులు జామర్లను ఉపయోగించి కమ్యూనికేషన్ వ్యవస్థను స్తంభింపజేసే ప్రమాదం ఉందని పోలీసులు భావిస్తున్నారు. జామర్ల వల్ల మొబైల్ ఫోన్‌, సెల్‌ ఫోన్‌ బేస్‌ స్టేషన్‌లను స్తంభించే ప్రమాదం ఉంది.

వీటి వల్ల కమ్యూనికేషన్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. 50 మీటర్ల పరిధిలో మొబైల్‌ సిగ్నల్స్‌ స్తంభించి, కాల్స్‌, మెసేజెస్‌, డేటా..ఏవీ పనిచేయవు. కమ్యూనికేషన్‌ వ్యవస్థను స్తంభింపజేసే ప్రమాదం ఉంది. ఇది విద్రోహ శక్తుల చేతిలో పడితే డేంజర్‌ అని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. సంఘ విద్రోహ శక్తులు, నేరాలకు పాల్పడినప్పుడు ఈ జామర్లను ఉపయోగిస్తే బాధితులు మొబైల్‌ ద్వారా పోలీసులను కాంటాక్ట్‌ చేయడానికి అవకాశం ఉండదంటున్నారు సైబర్ నిపుణులు. ఈ నేపథ్యంలోనే తమ తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులు లభ్యమయ్యాయంటున్నారు ఢిల్లీ పోలీసులు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా బ్యాగులను చూసినట్లయితే, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..