ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత శనివారం ఈడీ విచారణకు హాజరవుతున్నారు. అటు కవిత విచారణ వేళ భారీ ట్విస్ట్ నెలకొంది. ఈడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు సిసోడియా రిమాండ్ రిపోర్టులోనూ కవిత పేరు ప్రస్తావనకు రావడం కలకలం రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ట్విస్టుల మీద ట్విస్టుల మధ్య ఇవాళ ఈడీ ఎదుట హాజరుకాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ కేసులో ఇప్పటికే ఓసారి కవితను ప్రశ్నించిన ఈడీ.. మరోసారి కన్‌ఫ్రంటేషన్ ఇంటరాగేషన్ చేసే ఆలోచనలో ఉంది. ఏకకాలంలో సిసోడియా, కవిత, అరుణ్‌పిళ్లైను విచారించే ఛాన్స్ ఉంది. ప్రధానంగా అరుణ్ పిళ్లైతో కవిత ఆర్థిక లావాదేవీలపైనే ఈడీ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇండో స్పిరిట్ సంస్థలో వాటాలపైనా ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానని ట్విస్ట్ ఇచ్చారు అరుణ్ పిళ్లై. ఢిల్లీ రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారాయన. తాను ఎమ్మెల్సీ కవితకు బినామీనని పిళ్లై ఈ మధ్యే ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. ఆ తర్వాత ఆ వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానని.. కేసులో తన పాత్రపై విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు. ఈనెల 13 వరకూ అరుణ్ పిళ్లై ఈడీ కస్టడీలో ఉండనున్నారు. అందుకే పిళ్లై పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టు ఈడీకి నోటీసులు ఇచ్చింది. లిక్కర్ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్టు చేసింది. వారి వాంగ్మూలం, సేకరించిన వివరాలు, దర్యాప్తులో తేలిన ఆధారాలతో కవితను విచారించేందుకు సిద్దమైంది.
లిక్కర్ స్కామ్‌లో ఈడీ కస్టడీలో ఉన్న సిసోడియా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగినట్లు, సౌత్‌గ్రూప్‌ను ఆపరేట్‌చేసిన వారిలో కవితదే కీలకమని ఈడీ స్పష్టం చేసింది. కవిత, మాగుంట శ్రీనివాస్ సౌత్ గ్రూప్‌కి నాయకత్వం వహించారని ఈడీ పేర్కొంది. 2021 మార్చి 19, 20న సిసోడియా ప్రతినిధి విజయ్‌నాయర్‌ను ఎమ్మెల్సీ కవిత కలిశారు. లిక్కర్ వ్యాపారంలో కవితకు మేలు జరిగేలా..అందుకు ప్రతిఫలాన్ని ఎలా తీసుకోవాలనే దానిపై చర్చించుకున్నారు. 2021 జూన్‌లో హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో ఈ కుట్రకు బీజం పడిందని రిపోర్ట్‌లో ప్రస్తావించింది. ఐటీసీ హోటల్ మీటింగ్‌లో అరుణ్ పిళ్లై, విజయ్‌నాయర్, అభిషేక్ బోయినపల్లి, దినేశ్ అరోరా పాల్గొన్నట్లు ఈడీ క్లారిటీ ఇచ్చింది. 100కోట్లు హవాలా మార్గాల్లో చెల్లించినట్లు సౌత్ గ్రూప్ ప్రతినిధిగా ఉన్న బుచ్చిబాబు చెప్పినట్లు సమాచారం. ఈ మొత్తం వాట్సాప్ సంభాషణను ఈడీ డీకోడ్ చేసింది. విజయ్‌నాయర్‌ను ‘V’ గా, కవితను ‘Madam’గా, సమీర్ మహేంద్రును ‘Samee’గా వ్యవహరిస్తూ చాటింగ్ చేసినట్లు గుర్తించింది. ‘V’ నీడ్ మనీ అన్న వ్యాఖ్యానికి విజయ్‌నాయర్‌కి డబ్బు కావాలని అర్ధమని పేర్కొంది. కవితకు దాదాపు 33శాతం వాటా ఇస్తామంటూ చాటింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది.
కవితకు ఈడీ నోటీసులపై స్పందించారు సీఎం కేసీఆర్. కవితను అన్యాయంగా కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించారు. కేసులకు ఎట్టిపరిస్థితుల్లో భయపడేది లేదని.. న్యాయపోరాటం చేస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దామన్నారు కేసీఆర్. బీజేపీలో చేరని వారిని కేసులతో వేధిస్తున్నారని.. కవిత చేరని కారణంగానే ఇబ్బందులకి గురిచేస్తున్నారని మండిపడ్డారు.
ఈడీ నోటీసులతో కవిత న్యాయ నిపుణులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. లీగల్‌గా న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకొనే విషయమై చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఈడీ విచారణకు హాజరవుతున్న క్రమంలో చెల్లికి నైతిక మద్దతు ఇవ్వడానికి వెళ్లినట్టు సమాచారం. ఇవాళ, రేపు ఢిల్లీలోనే ఉంటారు కేటీఆర్. అక్కడ న్యాయనిపుణులతో భేటీకానున్నారు. కేటీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హస్తినబాట పట్టారు. మొత్తానికి పిళ్లై తన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లుగా పిటిషన్ దాఖలు చేయటం.. ఆ వెంటనే స్పెషల్‌కోర్టు ఈడీకి నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. రోజుకో కొత్త ట్విస్టుతో వెళ్తున్న లిక్కర్‌స్కామ్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి