పోలీసులు మమ్మల్ని ఆపినందునే బ్యారికేడ్లు విరగగొట్టాం, రైతు నేత సత్నామ్ సింగ్ పన్ను వెల్లడి
ఢిల్లీలో నిన్న జరిగిన హింసాత్మక ఘటనల్లో సింఘ్ బోర్డర్లో మొదట బ్యారికేడ్లను తామే విరగగొట్టామని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ..
ఢిల్లీలో నిన్న జరిగిన హింసాత్మక ఘటనల్లో సింఘ్ బోర్డర్లో మొదట బ్యారికేడ్లను తామే విరగగొట్టామని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నేత సత్నామ్ సింగ్ పన్ను తెలిపారు. ముందుకు వెళ్లకుండా తమను పోలీసులు ఆపివేయడంతో తమ సహచరులు బ్యారికేడ్లను విరగగొట్టారని, కొన్ని చోట్ల తొలగించారని ఆయన చెప్పారు. ఇందుకు తామే బాధ్యులమన్నారు. మా అన్నదాతల ఆందోళనను పక్కదారి పట్టించేందుకు రెడ్ ఫోర్ట్ వద్ద బీజేపీయే అల్లర్లను ప్రేరేపించిందని ఆయన ఆరోపించారు. . అసలు ఎర్రకోట ఘటనకు, తమకు సంబంధం లేదన్నారు. ఆ ప్రాంతంలో జరిగిన ఘటనలకు పంజాబీ నటుడు దీప్ సిద్దు కారకుడని సత్నామ్ సింగ్ పన్నుఅన్నారు. రెడ్ ఫోర్ట్ వద్ద అతడిని పోలీసులు ఎందుకు ఆపలేదని ఆయన ప్రశ్నించారు. అధికార బీజేపీకి అతడు సన్నిహితుడని ఆయన అన్నారు.
నిన్న జరిగిన ఘటనల్లో పోలీసులు రైతులపై లాఠీచార్జి చేసి, బాష్ప వాయువు ప్రయోగించారు. ముఖ్యంగా రైతుల ఎర్రకోట ముట్టడి తీవ్ర హింసాత్మకంగా మారింది.