దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల హీట్ సెగలు రేపుతోంది. ఆప్.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య హైవోల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తోంది. గెలుపే లక్ష్యంగా మూడు పార్టీలు సరికొత్త ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నాయి.. అయితే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు మళ్లీ చిక్కులు ఎదురయ్యాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు లిక్కర్ కేసు మళ్లీ కదలింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా విచారణకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కి బుధవారం అనుమతి ఇచ్చింది.
అయితే.. ప్రజా ప్రతినిధుల్ని విచారించాలంటే ముందస్తుగా అనుమతి ఉండాలంటూ గత నవంబర్‌లో సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అనుమతి కోసం ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ VK సక్సేనాకి చాన్నాళ్ల క్రితమే ఈడీ లేఖ రాసింది. దానిపై ఆయన నిర్ణయం ఇప్పుడు తీసుకున్నారు. ఆ వెంటనే కేంద్రం కూడా ED విచారణకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా.. 70 శాసనసభ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఫిబ్రవరి 5న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడికానున్నాయి.. ఈ క్రమంలోనే.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణకు కేంద్రం ఈడీకి అనుమతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
అయితే.. ఢిల్లీ లిక్కర్ కేసు సూత్రదారి, కింగ్‌పిన్ ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాలే అంటూ ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది.. ఈ కేసులో కేజ్రీవాల్ సహా పలువురిని ఈడీ అరెస్టు చేయడంతోపాటు విచారించింది.. కాగా.. 2024 మార్చి 21న కేజ్రీవాల్‌ను ED మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసింది. ఇదే కేసులో జూన్ 26న CBI కూడా రంగంలోకి దిగి అవినీతి కేసులో అరెస్టు చేసింది. చివరికి సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిలిచ్చింది. ఈకేసులో మనీష్ సిసోడియా 17 నెలలపాటు జైల్లో ఉన్నారు. ఇప్పుడు తాజా ఈడీ విచారణకు అనుమతి నేపథ్యంలో.. ఢిల్లీ రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. మనీలాండరింగ్ కేసులో మనీష్ సిసోడియాను కూడా ED ప్రాసిక్యూట్ చేయబోతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..