ఢిల్లీ, ఏప్రిల్ 1: మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు సోమవారం (ఏప్రిల్ 1) ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఈడీ ఆధికారుల కస్టడీలో ఉన్నారు. రౌస్ అవెన్యూ కోర్టు వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించగా.. ఆ గడువు మార్చి 28న ముగిసింది. దీంతో కోర్టులో కేజ్రీని హాజరుపరుచగా మరో మూడు రోజులు కస్టడీని పొడిగించింది. కోర్టు విధించి ఈడీ కస్టడీ నేటితో ముగియడంతో సోమవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో అధికారులు హాజరుపరిచారు. భారీ భద్రత మధ్య ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు.
ఈడీ తరపు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ.. రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22లో జరిగిన అవకతవకలకు కేజ్రీవాల్ కీలక కుట్రదారు అని వాదించారు. పాలసీ రూపకల్పనలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్నాడని, క్రైమ్‌లో వసూళ్ల నిర్వహణలో కేజ్రీవాల్ పాలుపంచుకున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ పాలసీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని 2022లో గోవాలో జరిగిన ఆప్ ఎన్నికల ప్రచారానికి వినియోగించారని ASG రాజు కోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదనీ, ఆయనను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోరారు. కేజ్రీవాల్ తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ.. కొందరు సాక్షుల వాంగ్మూలాలు మినహా కేజ్రీవాల్ అక్రమాలకు సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యాధారాలు లేవని అన్నారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు కేజ్రీకి 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను తీహార్ జైలుకు తరలించనున్నారు.
Excise policy case | Delhi’s Rouse Avenue court sends Delhi CM Arvind Kejriwal to judicial custody till April 15 pic.twitter.com/EQhviDECmF
— ANI (@ANI) April 1, 2024
కేజ్రీవాల్‌ను కోర్టుకు తీసుకువస్తున్న సమయంలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్‌నలకు సమాధానం చెప్పారు. ప్రధాని మోదీ చేస్తోన్న చర్యలు దేశానికి మంచిది కాదని కేజ్రీవాల్ ఈ సందర్భంగా అన్నారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ పిటిషన్ మంగళవారం విచారించే అవకాశం ఉంది. కాగా ఈ కేసులో ఇప్పటికే ఆప్ నేతలు మనీశ్ సిసోదియా, సంజయ్ సింగ్‌తోపాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టైన విషయం తెలిసిందే. వీరంతా ప్రస్తుతం తీహార్ జైల్లోనే ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.