Delhi Govt: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ మధ్య విభేదాలు మరింత పెరిగాయి. తమ ప్రభుత్వానికి తెలియజేయకుండా బైజాల్..నగరంలో కోవిడ్ పరిస్థితిపై అధికారులతో నేరుగా సమావేశాన్ని నిర్వహించడాన్ని కేజ్రీవాల్ తప్పు పడుతున్నారు. ఇలా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమని ఆయన ట్వీట్ చేశారు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వానికి ఏ మాత్రం సమాచారం తెలియజేయకుండా పోటీ సమావేశాలను నిర్వహించడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే అని ఆయన పేర్కొన్నారు. అధికారులతో లెఫ్టినెంట్ గవర్నర్ నిర్వహిస్తున్న సమావేశం తాలూకు ఫోటోలను ఆయన తన ట్వీట్ కి జోడించారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని పక్కన బెట్టి అనిల్ బైజాల్ కి ఎక్కువ అధికారాలను కట్టబెట్టే సవరణ చట్టాన్ని గత మార్చిలో పార్లమెంట్ ఆమోదించింది. నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) చట్టంగా దీన్ని వ్యవహరించారు.
అప్పటి నుంచి సీఎం. లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఈ సవరణ చట్టం ఢిల్లీ ప్రజలను అవమానించడమే అని కేజ్రీవాల్ తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కేంద్రం అవమానించడమేనన్నారు. కాగా ఢిల్లీలో థర్డ్ వేవ్ ముప్పు రాకుండా అధికారులు అన్ని చర్యలూ తీసుకోవాలని, ఆక్సిజన్, ఆస్పత్రుల్లో బెడ్స్ తదితర సౌకర్యాల కొరత లేకుండా చూడాలని అనిల్ బైజాల్ అధికారులకు సూచించారు. ఆదేశాలు కూడా జారీ చేశారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండగా గవర్నర్ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని నిపుణులు తప్పు పడుతున్నారు. అందులోనూ ప్రభుత్వానికి తెలపకుండా ఆయన చేపట్టిన చర్యను విమర్శిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : తండ్రికి తగ్గ తనయుడిగా..కర్రసాము వీరుడిగా..పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్…:Akira Nandan Martial Arts video.