కాలేజీ టాపర్ నుండి టెర్రరిస్ట్‌గా.. ఢిల్లీ పేలుడు వెనక ఉన్న ఈ మహిళా డాక్టర్ కథ తెలిస్తే షాకే..

దేశ రాజధానిలో జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తులో సంచలన విషయం వెలుగు చూసింది. ఫరీదాబాద్‌కు చెందిన ఒక మెడికల్ లెక్చరర్ డాక్టర్ షాహీన్ షాహిద్.. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ కోసం పనిచేస్తున్నట్లు తేలింది. మసూద్ అజర్ సోదరి ఆదేశాలతో భారత్‌లో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి దాడులు నిర్వహించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

కాలేజీ టాపర్ నుండి టెర్రరిస్ట్‌గా.. ఢిల్లీ పేలుడు వెనక ఉన్న ఈ మహిళా డాక్టర్ కథ తెలిస్తే షాకే..
Dr Shaheen Shahid Arrested In Delhi Blast

Updated on: Nov 12, 2025 | 11:47 AM

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జమ్మూ కాశ్మీర్ పోలీసులు జరిపిన దర్యాప్తులో.. ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్‌కు సంబంధించిన వైట్-కాలర్ టెర్రర్ నెట్‌వర్క్‌లో ఫరీదాబాద్‌కు చెందిన మెడికల్ లెక్చరర్ డాక్టర్ షాహీన్ షాహిద్ ప్రధాన పాత్రధారిగా గుర్తించారు. దీంతో అధికారులు ఆమెను ఈ నెల 11న అరెస్ట్ చేశారు. దేశంలో జైషే మహిళా విభాగాన్ని ఏర్పాటుతో పాటు దానికి నాయకత్వం వహించే బాధ్యతను షాహిన్ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

మసూద్ అజార్ సోదరితో..

ఈ కొత్తగా ఏర్పడిన నెట్‌వర్క్ దేశంలో మహిళలను నియమించడం, వారికి శిక్షణ ఇవ్వడం, రాడికల్ ఆలోచనలను వ్యాప్తి చేయడంపై దృష్టి సారించింది. రహస్య సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా షాహీన్ పాకిస్తాన్‌లోని జైషే నేతలతో టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. జైష్-ఎ-మొహమ్మద్‌ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేరుగా డాక్టర్ షాహీన్‌కు ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లో JeM మహిళా విభాగానికి సాదియానే నాయకత్వం వహిస్తోంది.

డాక్టర్ షాహీన్ అరెస్ట్.. ఆమె సహచరులైన మరో ఇద్దరు వైద్య నిపుణులు.. డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై, డాక్టర్ ఉమర్ ఉ నబీలను అరెస్ట్ చేసిన తర్వాత జరిగింది. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తులో వీరి పాత్ర బయటపడింది. నవంబర్ 8న డాక్టర్ ముజమ్మిల్‌ను అరెస్ట్ చేసినప్పుడు, అతని వద్ద AK-47 రైఫిల్, పేలుడు పదార్థాలు దొరికాయి. విచారణలో ముజమ్మిల్.. డాక్టర్ షాహీన్ పాత్ర గురించి, JeM మహిళా సభ్యులతో ఆమె సమన్వయం గురించి చెప్పడంతో నవంబర్ 11న ఆమెను అరెస్ట్ చేశారు. అనుమానం రాకుండా ఉండేందుకు ఆమె తన డాక్టర్ హోదాను ఉపయోగించుకుంది.

డాక్టర్ షాహీన్ నేపథ్యం

1979లో లక్నోలో జన్మించిన షాహిన్.. ప్రయాగ్‌రాజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఎండీ చేసింది. కాన్పూర్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసింది. 2013లో ఆమె ఎవరికీ చెప్పకుండా ఉద్యోగానికి రావడం మానేసింది. విడాకుల తర్వాత ఆమె ఉగ్రవాద నిధుల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న డాక్టర్ ముజమ్మిల్‌తో సంబంధాన్ని పెంచుకుంది. 2015లో భర్త డాక్టర్ జాఫర్ సయీద్‌తో విడాకులు తీసుకున్న తర్వాత, ఆమె డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనైతో సంబంధాన్ని పెంచుకుంది. ఆ తరువాత హర్యానాలోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంతో ఆమెకు సంబంధాలు ఏర్పడ్డాయి. అక్కడి నుంచే ఆమె డాక్టర్ ముజమ్మిల్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించింది. అధికారుల దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..