Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Results 2025: మెజార్టీ దిశగా బీజేపీ.. ఢిల్లీలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు..?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్‌లను చూస్తే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో, కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ 30 దాటి పెరగడం లేదు. అధికారం చేపట్టాలంటే 36 సీట్లు గెలవాలి. బీజేపీ 43 సీట్లలో, ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

Delhi Results 2025: మెజార్టీ దిశగా బీజేపీ.. ఢిల్లీలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు..?
Manoj Tiwari, Vijender Gupta, Virendra Sachdeva
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 08, 2025 | 12:09 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్‌లను పరిశీలిస్తే, 27 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. రెండు గంటల కౌంటింగ్ తర్వాత ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, 70 సీట్లలో, బీజేపీ 43 సీట్లలో, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మరోసారి రిక్తహస్తాలతో వెనుకబడి ఉంది.

భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలిస్తే, ఆ పార్టీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. గత 27 సంవత్సరాలుగా ఢిల్లీలో బీజేపీ అధికారానికి దూరంగా ఉంది. అంతకు ముందు, 1993 లో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు బీజేపీ 49 సీట్లు గెలుచుకుంది. 5 సంవత్సరాల కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. చివరిసారిగా, 1998లో, సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఆమె ఈ పదవిలో 52 రోజులు మాత్రమే ఉండగలిగారు. కాగా, ఢిల్లీలో కాబోయే ముఖ్యమంత్రి పదవికి ముగ్గురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

మనోజ్ తివారీ (పూర్వాంచల్ అభ్యర్థి)

ఢిల్లీలో బీజేపీ విజయం సాధిస్తే, ఆ పార్టీ ముఖ్యనేత మనోజ్ తివారీని ముఖ్యమంత్రి రేసులో ముందు వరుసలో ఉన్నారు. మనోజ్ తివారీ పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన ముఖ్య నాయకుడిగా ఉన్నారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను కూడా నిర్వహించారు. ఆయన రెండుసార్లు ఎంపీగా ఉన్నారు. ఢిల్లీలో పూర్వాంచల్ ఓట్లను ఏకం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎవరు ముఖ్యమంత్రి అయినా ఢిల్లీ సమగ్ర అభివృద్ధిని తీసుకువస్తానని అన్నారు.

విజేందర్ గుప్తా (ఢిల్లీ రోహిణి అభ్యర్థి)

ఢిల్లీ రోహిణి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయేందర్ గుప్తా కూడా సీఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన బలమైన నాయకుడిగా పేరుగాంచారు. ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పాత్రను బాగా పోషించారు. పార్టీ కేడర్, అధిష్టానంలో ఆయనకు బలమైన పట్టు ఉందని భావిస్తారు. బీజేపీ గెలిస్తే, ఆ పార్టీ విజేందర్ గుప్తా వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు.

వీరేంద్ర సచ్‌దేవా (ఢిల్లీ బీజేపీ అధ్యక్షులు)

భారతీయ జనతా పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షులు వీరేంద్ర సచ్‌దేవా పేరు కూడా ముఖ్యమంత్రి పదవి రేసులో వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఆయన కష్టపడి పనిచేశారు. ఢిల్లీలో బీజేపీ విజయంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఢిల్లీలో పార్టీ గెలిస్తే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా వీరేంద్ర సచ్‌దేవా పేరు కూడా తెరపైకి రావచ్చు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మీడియాతో మాట్లాడుతూ, “ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా, అభివృద్ధి నమూనాను స్వీకరించినందుకు ఓటు వేశారన్నారు. ఫలితాలను చూస్తుంటే, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఖాయంగా కనిపిస్తుందన్నారు. ఢిల్లీలో ఏ బీజేపీ కార్యకర్త ముఖ్యమంత్రి కావాలో కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని వీరేంద్ర సచ్‌దేవా స్పష్టం చేశారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి నుంచి త్రిముఖ పోటీ నెలకొంది. ఆప్‌ ఒంటరిగా పోటీ చేసింది. ఆప్‌ , బీజేపీ , కాంగ్రెస్‌ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. నాలుగోసారి విజయం కోసం ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా శ్రమించారు. అయితే బీజేపీ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని మోదీ స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి సమాజ్‌వాదీ పార్టీ మద్దతు ప్రకటించింది.

ఇండి కూటమిలో కలిసిరాని మిత్రులు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇండి కూటమిలోని విభేదాలను మరోసారి స్పష్టంగా కనిపించాయి.ఇప్పటికి కూడా కాంగ్రెస్‌ , ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇండి కూటమిలోనే ఉన్నాయి. అయినప్పటికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో ఆప్‌పై బీజేపీ నేతల కంటే ఎక్కువగా కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేశారు. 2020లో, కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ మద్యం కుంభకోణంలో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజీనామా చేశారు. ఆయన 4 సంవత్సరాల 7 నెలల 6 రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగారు. దీని తరువాత ఆయన అతిషిని ముఖ్యమంత్రిని చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..