Visakhapatnam: జాక్‌పాట్ కొట్టిన విశాఖ షిప్‌యార్ట్.. 5 నౌకలను ఆర్డర్ చేసిన భారత రక్షణ శాఖ.. వివరాలివే..

|

Aug 26, 2023 | 6:31 AM

Visakhapatnam: నౌకల నిర్మాణం, మరమ్మతుల విషయంలోనూ హిందుస్థాన్‌ షిప్‌ యార్డు తనదైన ముద్ర వేస్తోంది. ఓ వైపు స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల నిర్మాణంలో దూసుకుపోతూనే.. మరో వైపు సాంకేతికతకు పదును పెడుతోంది.  ఈ క్రమంలోనే తాజాగా భారీ ఆర్డర్‌ని కైవసం చేసుకుంది. ఈ ఆర్డర్ కారణంగా నౌకా నిర్మాణం రంగంతో పాటు నౌకా నిర్మాణంలో అనుబంధ సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు విస్తృత అవకాశాలు కలుగుతాయని కేంద్రం చెబుతోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలకు చెందిన సంస్థలు జత కడుతున్న..

Visakhapatnam: జాక్‌పాట్ కొట్టిన విశాఖ షిప్‌యార్ట్.. 5 నౌకలను ఆర్డర్ చేసిన భారత రక్షణ శాఖ.. వివరాలివే..
Hindustan Shipyard Limited and Defence Ministry Contract
Follow us on

విశాఖపట్నం, ఆగస్టు 26: విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌కు భారీ ఆర్డర్ కైవసం చేసుకుంది. రూ. 19 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు అప్పగిస్తూ రక్షణ శాఖ సంతకాలు చేసింది. ఈ కంట్రాక్ట్ ప్రకారం ఇండియన్ నేవీ అవసరాల కోసం ఐదు భారీ ఫ్లీట్ సపోర్ట్ షిప్‌లు తయారు చేసి ఇవ్వవలసి ఉంటుంది. తద్వారా సముద్రంలో ఆపరేషన్లలో ఉన్న యుద్ధ నౌకలకు అవసరమైన ఇంధనం, నీరు, ఆయుధాలు, స్టోర్ పరికరాలు, ఆహారం అందించేందుకు ఈ నౌకలు  ఉపయోగపడనున్నాయని సమాచారం. ఆగస్టు 16న జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో నావికా దళాన్ని పటిష్టం చేసే క్రమంలో ఫ్లీట్ సపోర్ట్ షిప్‌లను కొనుగోలు చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కోక్క నౌక 44 వేల టన్నుల బరువుతో ఉండేలా డిజైన్లు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కంట్రాక్ట్ ప్రకారం వీటిని 8 ఏళ్లలో నిర్మించి భారత రక్షణ శాఖకు అప్పగించాల్సి ఉంటుంది.

అయితే ఇంత పెద్ద నౌకలను భారత్‌లో నిర్మించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంత భారీ నౌకల నిర్మాణానికి హిందుస్థాన్ షిప్‌ యార్డ్ సిద్ధం అవుతోంది. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయంగానే వీటిని నిర్మించే సంస్థకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హిందూస్థాన్ షిప్ యార్ట్‌కి వచ్చిన ఈ ఆర్డర్ కారణంగా నౌకా నిర్మాణం రంగంతో పాటు నౌకా నిర్మాణంలో అనుబంధ సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు విస్తృత అవకాశాలు కలుగుతాయని కేంద్రం చెబుతోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలకు చెందిన సంస్థలు జత కడుతున్న నేపథ్యంలో నౌకా నిర్మాణంలో హిందుస్థాన్‌ షిప్‌ యార్డు సరికొత్త అధ్యాయాలను లిఖిస్తోంది. ఎలాంటి నౌకలు, సబ్‌మెరైన్ల మరమ్మతులు, నిర్మాణాలను అయినా రికార్డు సమయంలోనే పూర్తి చేస్తూ ఆయా సంస్థలకు అప్పగిస్తున్న హిందుస్థాన్‌ షిప్‌ యార్డు దేశంలోనే అతి పెద్ద ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా ముందుకు దూసుకుపోతోంది.

ఇవి కూడా చదవండి

రక్షణ శాఖలో ఆత్మ నిర్భర భారత్..


ఇదిలా ఉండగా ఇప్పటికే భారత నౌకా దళం కోసం డైవింగ్‌ సపోర్ట్‌ వెసల్‌ షిప్‌లో తొలిసారిగా 3 మెగా వాట్ల భారీ డీజిల్‌ జనరేటర్‌ ఏర్పాటు చేసి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఆత్మ నిర్భర్‌ భారత్‌లో భాగంగా పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల తయారీకి ఉపక్రమించిన హిందుస్థాన్‌ షిప్‌ యార్డు లిమిటెడ్‌ సంస్థ భారత నౌకా దళానికి చెందిన షిప్‌ తయారీలో ప్రత్యేక వ్యవస్థని అందుబాటులోకి తీసుకొచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..