పిల్లలకు జాతీయ అవార్డు ఛాన్స్..! PM బాల పురస్కార్ 2026 నామినేషన్లు ఓపెన్.. అర్హులు వీరే!
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే చిన్నారుల్లో అసాధారణ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందించే అత్యున్నత బాల పురస్కారాల్లో ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (PMRBP)’ ఒకటి. 2026 సంవత్సరానికి సంబంధించిన ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాల కోసం కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. మొదట నిర్ణయించిన గడువును పొడిగిస్తూ 2026 ఆగస్టు 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది.

దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే చిన్నారుల్లో అసాధారణ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందించే అత్యున్నత బాల పురస్కారాల్లో ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (PMRBP)’ ఒకటి. 2026 సంవత్సరానికి సంబంధించిన ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాల కోసం కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. మొదట నిర్ణయించిన గడువును పొడిగిస్తూ 2026 ఆగస్టు 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది.
ఈ పురస్కారం ఎందుకు ఇస్తారు?
సమాజంపై సానుకూల ప్రభావం చూపుతూ అసాధారణ ప్రతిభ, ధైర్యం, సేవా భావం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను ప్రదర్శించిన పిల్లలను గుర్తించి గౌరవించడమే ఈ పురస్కారం ప్రధాన ఉద్దేశం. చిన్న వయసులోనే విశేష విజయాలు సాధించిన బాలలను దేశానికి ఆదర్శంగా నిలబెట్టడం, ఇతర పిల్లలకు స్ఫూర్తినివ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును అందజేస్తోంది. పిల్లల్లో ఉన్న ప్రతిభను జాతీయ స్థాయిలో గుర్తించడం మాత్రమే కాకుండా, వారి కృషికి ప్రభుత్వ స్థాయిలో గుర్తింపు లభించేలా చేయడం ఈ పురస్కారం ప్రత్యేకత.
ఏయే విభాగాల్లో పురస్కారాలు?
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ను మొత్తం ఆరు విభాగాల్లో ప్రదానం చేస్తారు. సాహసం, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు – సంస్కృతి, శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన పిల్లలను ఎంపిక చేస్తారు.
ఎవరు అర్హులు?
ఈ పురస్కారానికి భారతీయ పౌరులైన పిల్లలు మాత్రమే అర్హులు. అర్హత నిబంధనల ప్రకారం:
2026 జూలై 31 నాటికి 5 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి.
18 సంవత్సరాలు నిండకూడదు.
గత రెండేళ్లలో చేసిన విశిష్ట సేవలు లేదా ప్రతిభను మాత్రమే పరిశీలిస్తారు.
నామినేషన్లు ఎవరు పంపవచ్చు?
ఈ పురస్కారం కోసం పలు మార్గాల్లో నామినేషన్లు సమర్పించవచ్చు. పిల్లలు స్వయంగా దరఖాస్తులు అందించవచ్చు. అలాగే వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పార్లమెంటు సభ్యులు, జిల్లా కలెక్టర్లు, డీఎంలు, సామాజిక సంస్థలు ఇతర అర్హత కలిగిన సంస్థలు ప్రతిభ కలిగిన పిల్లల నామినేషన్లను సమర్పించవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి?
నామినేషన్లు పూర్తిగా ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు. దరఖాస్తులు కేంద్ర ప్రభుత్వ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించాలి. పోర్టల్: [https://awards.gov.in] (https://awards.gov.in). నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: 2026 ఆగస్టు 15.
ఎంపిక ఎలా జరుగుతుంది?
నిపుణులతో కూడిన కమిటీ అన్ని నామినేషన్లను పరిశీలించి, అర్హులైన పిల్లలను ఎంపిక చేస్తుంది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ కమిటీ సిఫార్సుల మేరకు గరిష్ఠంగా 25 మంది పిల్లలకు ప్రతి సంవత్సరం ఈ అవార్డులను అందజేస్తారు.
విజేతలకు ఏమి లభిస్తుంది?
ఎంపికైన ప్రతి బాలుడు లేదా బాలికకు జాతయ పతకం తోపాటు ప్రశంసాపత్రం, ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. అలాగే దేశ అత్యున్నత స్థాయిలో సత్కారం పొందే అవకాశం కూడా ఉంటుంది. 2026 డిసెంబర్ 26న ‘వీర బాల దివస్’ సందర్భంగా విజేతల పేర్లను ప్రకటిస్తారు. తర్వాత న్యూఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలను ప్రదానం చేస్తారు.
ఈ పురస్కారం ప్రాధాన్యం ఏమిటి?
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ దేశంలో పిల్లలకు అందించే అత్యంత ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాల్లో ఒకటి. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించిన వారికి ఇది జాతీయ గుర్తింపును తీసుకువస్తుంది. ఈ అవార్డు ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు, సమాజానికి సేవ చేయాలనే స్పూర్తి మరింత బలపడుతుంది. కేవలం చదువులోనే కాదు.. సాహసం, శాస్త్ర పరిశోధనలు, క్రీడలు, కళలు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవ వంటి రంగాల్లోనూ విశేష ప్రతిభ కనబరిచిన చిన్నారులను దేశం గుర్తించి గౌరవిస్తోందనడానికి ఈ పురస్కారం ఒక గొప్ప నిదర్శనంగా నిలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
