ఉత్తర భారతావని చలి గుప్పిట గజగజలాడుతోంది. ప్రచండమైన శీతలగాలులు, మంచుతో జనాలు అల్లల్లాడుతున్నారు. జమ్మూ కాశ్మీర్లోని దాల్ సరస్సులో కొంతభాగం పూర్తిగా గడ్డ కట్టుకుపోయింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఆదివారం శ్రీనగర్ లో ,మైనస్ 6.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. మినిమమ్ టెంపరేచర్ ఆరు డిగ్రీలకు పడిపోవచ్ఛునని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే గరిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీలు ఉండవచ్ఛునన్నది వారి అంచనా. ఈ నెల 30 వ తేదీ రాత్రి నుంచి పశ్చిమ హిమాలయ ప్రాంతం మీదుగా వీచే శీతల గాలులు తీవ్ర ప్రభావం చూపుతాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఢిల్లీ, హర్యానా, యూపీ సహా వాయువ్య భారతంలో రానున్న రెండు మూడు రోజుల్లో వడగళ్లతో కూడిన చెదురుమదురు వర్షాలు పడవచ్ఛునని, తేలికపాటి మంచు తుపానులకు కూడా అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే గడచిన రెండు మూడు రోజులుగా దేశంలోని అనేక ప్రాంతాలను చలి పులి గడగడలాడిస్తోంది. ఢిల్లీ వంటి నగరాల్లో ఉదయం తొమ్మిది గంటలయినప్పటికీ పొగ మంచు కప్పివేసిన కారణంగా వాహనదారులు రోడ్లు సరిగా కనబడక పట్టపగలే తమ వాహనాలకు లైట్లను ఆన్ చేసి నడపవలసి వస్తోంది. దారి సరిగా కనబడక యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి.