Cyrus Mistry Death: టాటా సన్స్(Tata Sons) మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మరణం చుట్టూ ఎన్నో ప్రశ్నలు.. ఇంకెన్నో సందేహాలు నెలకొంటున్నాయి. ఆదివారంనాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సైరస్ మిస్త్రీ అంత్యక్రియలను మంగళవారం ముంబైలో నిర్వహించారు.సైరస్ మిస్త్రీ కారు ప్రమాదానికి కారణాలపై ముంబై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పలు కోణాల్లో లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. అటు సైరస్ మిస్త్రీ మరణం నేపథ్యంలో లక్షలకు లక్షలు పోసి కొనే కార్లు.. ఎంతవరకు సేఫ్.. తయారీ కంపెనీలు ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నాయి.. వాటిలో ఎంత స్పీడ్‌తో వెళ్తే బెటర్. ఎయిర్ బెలూన్స్ ఎన్ని ఉండాలి. ఇలాంటివి ఎన్నో, ఎన్నెన్నో.. వీటన్నిటిపైనే ఇప్పుడు అటు కేంద్రం.. ఇటు వెహికల్ తయారీ కంపెనీలు దృష్టి పెట్టాయి.
మిస్త్రీ ప్రయాణించిన కారు మెర్సిడస్ బెంజ్. టాప్ మోస్ట్ లగ్జరీ కార్లలో ఇదీ ఒకటి. దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగినా.. ప్రాణాపాయం నుంచి తప్పించేలా కొన్ని ప్రమాణాలతో ఈ కారు తయారవుతుంది. అయినా ఇంత దారుణం జరగడంతో మెర్సిడస్ బెంజ్ కంపెనీ యాజమాన్యం ఫోకస్ పెట్టింది. యాక్సిడెంట్ స్పాట్‌ను మెర్సిడెజ్ బెంజ్ యాజమాన్యం పరిశీలించింది. కారును పూర్తిగా తనిఖీ చేసింది. మున్ముందు మరిన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలనే ఆలోచనలో ఉంది బెంజ్ కంపెనీ.
అటు ప్రమాదానికి గురైన మెర్సిడస్ బెంజ్ కారు గతంలోనూ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంపింగ్ వంటి వరుస ట్రాఫిక్ ఉల్లంఘనలు గతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే నిబంధనల ఉల్లంఘన జరిగిన సమయంలో కారును ఎవరు నడుపుతున్నారో నిర్థారణకు రాలేదని అధికారులు వెల్లడించారు. అటు లోపభూయిష్టమైన బ్రిడ్జి డిజైన్ కూడా ప్రమాదానికి కారణమైనట్లు ఫోరెన్సిక్ నిపుణులు భావిస్తున్నారు. అతివేగం, సీటు బెల్ట్ వేసుకోకపోవడంతో పాటు బ్రిడ్జి డిజైన్ లోపం ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.
మిస్త్రీ ప్రయాణిస్తున్న కారులో 7 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. అవేవీ మిస్త్రీ మరణాన్ని ఆపలేకపోయాయి. దీనికి కారణం వెనుక కూర్చున్న వాళ్లకు.. ముందు ఎయిర్ బ్యాగ్స్ లేకపోవడమే. ఈ కారులో 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా.. అవన్నీ డోర్ వైపు నుంచి ఓపెన్ అయ్యే కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్. వెనుక సీటులో కూర్చున్న వాళ్లకు ముందు భాగంలో ఎలాంటి ఎయిర్ బ్యాగ్స్ లేకపోవడమే.. మిస్త్రీ మరణానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు అధికారులు.
ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న కేంద్రం కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. కారు తయారీలో ప్రమాణాలు పెంచాలని ఆదేశించింది. ఇండియాలో చాలావరకు ప్యాసింజెర్ కారులో 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటున్నాయి. కానీ ఎక్స్‌పోర్ట్ చేసే వాహనాలకు 6 బ్యాగ్స్ ఉంటున్నాయి. దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు సీటుబెల్ట్ ధరించకుండా ప్రయాణం చేసే ప్రయాణీకులపైనా ఇక నుంచి సీరియస్ యాక్షన్ తీసుకోబోతోంది కేంద్రం. భారీగా పైన్లు వేసేందుకు సిద్ధమవుతోంది. కారు బ్యాక్ సీట్‌లో కూర్చున్న వ్యక్తులు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా.. మినిమం వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తారు. ఇది వరకు లాగా చెకింగ్ చేసి దొరికితేనే ఫైన్ వేయడం కాదు.. సీసీ కెమెరా ఫుటేజీలో దొరికినా ఫైన్ చలాన్ పడిపోద్ది.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి