Cyclone Tauktae Live: గుజరాత్‌ తీరాన్ని తాకిన ‘తౌటే’ తుఫాన్.. రెండు గంటల పాటు భారీ వర్షాలు..

| Edited By: Shaik Madar Saheb

May 18, 2021 | 6:15 AM

Cyclone Tauktae Tracker Live rain Updates: ఒక వైపు కరోనా మమహ్మారి విజృంభిస్తుంటే.. మరో వైపు తుఫాను భయాందోళన కలిగిస్తోంది. తౌక్టే తుఫాను దేశ పశ్చిమ తీర ప్రాంతాలను..

Cyclone Tauktae Live: గుజరాత్‌ తీరాన్ని తాకిన ‘తౌటే’ తుఫాన్.. రెండు గంటల పాటు భారీ వర్షాలు..
Tauktae Cyclone

Cyclone Tauktae Tracker Live rain Updates: ఒక వైపు కరోనా మమహ్మారి విజృంభిస్తుంటే.. మరో వైపు తుఫాను భయాందోళన కలిగిస్తోంది. తౌక్టే తుఫాను దేశ పశ్చిమ తీర ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్న ఈ తుఫాను కొద్దిసేపటి క్రితం గుజరాత్ తీర ప్రాంతాన్ని తాకింది. ఈ భీకర తుఫాన్ తీరాన్ని దాటడానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

‘తౌటే’ తుఫాన్ అతి తీవ్రమైన తుఫానుగా మారి గుజరాత్ తీర ప్రాంతాలను తాకింది. ఈ తుఫాను కారణంగా గుజరాత్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు ముంబైలో ఈ తుఫాన్ విధ్వంసం సృష్టించింది. ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ముందుగా ఈ నెల 18న తీరాన్ని దాటుతుందని అంచనా వేయగా.. ఇవాళ రాత్రి 11.30 కల్లా గుజరాత్‌లోని పోరుబందర్-మహువా మధ్య తీరం దాటనుంది.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 May 2021 09:49 PM (IST)

    అల్లకల్లోలంగా మారిన సముద్రం..

    సైక్లోన్ తౌక్టే నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. గుజరాత్‌లోని వెరవాల్ – సోమనాథ్ ప్రాంతంలో సముద్రం ప్రమాదకరంగా మారింది. ఈ తుఫాను గుజరాత్ తీరానికి దగ్గరగా ఉంది. వచ్చే 2 గంటలల్లో తీరం దాటుతుందని ఐఎండీ పేర్కొంది.

  • 17 May 2021 09:08 PM (IST)

    గుజరాత్ తీరాన్ని తాకిన తౌటే తుఫాను…

    తౌటే తుఫాన్ గుజరాత్ తీరాన్ని తాకింది. తీరాన్ని దాటేందుకు మరో రెండు గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

  • 17 May 2021 08:56 PM (IST)

    తుఫాను తౌటే కోసం 69 రెస్క్యూ, రిలీఫ్ టీంల నియామకం..

    సైక్లోన్ తౌటేకు సంబంధించి 69 మంది ఎన్‌డిఆర్‌ఎఫ్ రెస్క్యూ, రిలీఫ్ టీమ్‌లను మోహరించారు.

  • 17 May 2021 08:56 PM (IST)

    కొంకణ్ ప్రాంతంలో భారీ తుఫాను తౌటే వినాశనం, ముగ్గురు నావికులు తప్పిపోయారు

    మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో తౌటే తుఫాన్ కారణంగా ఆరుగురు మరణించగా.. ముగ్గురు నావికులు తప్పిపోయారు.

  • 17 May 2021 08:47 PM (IST)

    మహారాష్ట్రలో తుఫాను బీభత్సం.. 9 మందికి గాయాలు, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు..

    తౌటే తుఫాను మహారాష్ట్రలో వినాశనం సృష్టించింది. ఈ తుఫాన్ కారణంగా 6 మంది మరణించగా.. 9 మంది గాయపడ్డారు. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నష్టాన్ని అంచనా వేసి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

  • 17 May 2021 07:11 PM (IST)

    ‘తౌటే’ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో పీఎం వీడియో కాన్ఫరెన్స్..

    మహారాష్ట్రలో పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోదీ ఆరా తీశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో సోమవారం మోదీ ఫోన్‌లో మాట్లాడారు. తుఫాను కారణంగా జరిగే నష్టాల గురించి సీఎంను అడిగి తెలుసుకున్నారు. అయితే తుఫాను కారణంగా భారీ ఈదురు గాలులతో పెద్ద పెద్ద చెట్లు సైతం రోడ్లపైనే కూలిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ రోజు రాత్రి కూడా ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను కారణంగా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, అన్ని రకాలుగా అండగా ఉంటామని ప్రధాని మోదీ సీఎంకు భరోసా ఇచ్చారు.

    అలాగే గుజరాత్‌ ముఖ్యమంత్రి  విజయ్‌ రూపానీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌లతో కూడా మోదీ మాట్లాడారు. తుఫాను సృష్టిస్తున్న బీభత్సంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, తుఫానుతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉదయం నుంచి మూసివేశారు. మరింత నష్టం జరుగకుండా ముంబై వాసులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

  • 17 May 2021 06:53 PM (IST)

    కొట్టుకుపోయిన భారీ నౌక..

    ఈ తుఫాను వల్ల వీస్తున్న భీకరగాలులతో ముంబాయికి పశ్చిమ తీరాన బాంబే హైవేలో ఓ వ్యాపార నౌక కొట్టుకుపోయింది. ఈ నౌకలో 273మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న నౌకాదళం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఐఎన్‌ఎస్‌ కొచ్చి యుద్ధ నౌక సాయంతో గాలింపు కొనసాగిస్తున్నారు. కాగా, ఈ వారం చివరి నాటికి హిందూ మహాసముద్రం తుఫానులకు అనుకూలమైన వాతావరణంగా మారుతుందని చెబుతున్నారు.

  • 17 May 2021 06:15 PM (IST)

    ‘తౌటే’ ఎఫెక్ట్.. రాత్రి 8 గంటల వరకు ముంబై విమానాశ్రయం మూసివేత

    ‘తౌటే’ తుఫాన్ ముంబైలో బీభత్సం సృష్టిస్తోంది. కొద్ది గంటలుగా బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపధ్యంలో ముంబై విమానాశ్రయాన్ని రాత్రి 8 గంటల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

  • 17 May 2021 05:31 PM (IST)

    భారీ వర్షం, గాలి కారణంగా, ముంబైలోని వివిధ ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి..

    తుఫాను కారణంగా, మహారాష్ట్రలో భారీ వర్షాలు, ఈదురుగాలులు సంభవించాయి. ముంబైలోని వివిధ ప్రాంతాలలో భారీ వర్షాలు, గాలుల కారణంగా చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపోయాయి.

  • 17 May 2021 05:30 PM (IST)

    డీయూ, డామన్, దాదర్ నగర్ హవేలీలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పయనం..

    పూణేతో పాటు డామన్, డీయూ, దాదర్ నగర్ హవేలీలకు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు పయనమయ్యాయి.

  • 17 May 2021 05:29 PM (IST)

    అరేబియా సముద్రంలో ఎగిసిపడుతున్న అలలు..

    తౌటే తుఫాను దృష్ట్యా అరేబియా సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ముంబైలోని మెరైన్ డ్రైవ్ వీడియో అందుకు నిదర్శనం.

  • 17 May 2021 05:15 PM (IST)

    తుఫాన్‌ ప్రభావం ఏపీపై మరో 24గంటల పాటు కొనసాగుతుంది..

    తుఫాన్‌ ప్రభావం ఏపీపై మరో 24గంటల పాటు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. తక్కువ ఎత్తులో దక్షిణ,ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని.. వీటివల్ల అటు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

  • 17 May 2021 05:07 PM (IST)

    తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం..

    తౌటే తుఫాన్‌ కారణంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఆకాశం మేఘావృతమైంది. భారీ వర్షం కురిసింది. పిఠాపురం, కాకినాడ, రాజమండ్రి, మన్యం పరిసర ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు కమ్ముకుని..స్వల్ప గాలులతో కూడిన వర్షం పడింది.

  • 17 May 2021 04:50 PM (IST)

    ఏపీపై తౌటే తుఫాన్‌ ప్రభావం

    తౌటే తుఫాన్ ప్రభావం ఏపీపై పడింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాతావరణం మారిపోయింది. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవగా.. మరికొన్ని చోట్ల ఉక్కపోత పెరిగింది. ఇటు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా తుఫాన్‌ ప్రభావం తీవ్రత కనిపించింది.

  • 17 May 2021 04:35 PM (IST)

    962 మందిని ధోలేరా నుంచి తరలించారు: అహ్మదాబాద్ జిల్లా కలెక్టర్

    962 మందిని ధోలేరా నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అహ్మదాబాద్ జిల్లా కలెక్టర్ సందీప్ సాగలే తెలిపారు. ఇక్కడ మొత్తం 38 సురక్షిత ప్రదేశాలు ఉన్నాయి. ప్రజలందరికి వేగవంతంగా ర్యాపిడ్ యాంటిజెన్‌ టెస్టులను నిర్వహించి ఆయా ప్రదేశాలకు తరలించాం. వాటిల్లో కరోనా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తున్నాం. 

  • 17 May 2021 04:21 PM (IST)

    ‘తౌటే’ ఎఫెక్ట్.. సాయంత్రం 6 గంటల వరకు ముంబై ఎయిర్‌పోర్ట్ మూసివేత..

    ‘తౌటే’ తుఫాన్ ముంబైలో బీభత్సం సృష్టిస్తోంది. కొద్ది గంటలుగా బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపధ్యంలో ముంబై విమానాశ్రయాన్ని సాయంత్రం 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

  • 17 May 2021 04:05 PM (IST)

    తెలుగు రాష్ట్రాలకు ‘తౌటే’ ఎఫెక్ట్..

    తెలుగు రాష్ట్రాలపైనా ‘తౌటే’ తుఫాన్ ఎఫెక్ట్ పడింది. తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. అలాగే ఏపీలో కూడా మూడు రోజులు వర్షాలు పడతాయని తెలిపింది. ముఖ్యంగా రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం.

  • 17 May 2021 03:57 PM (IST)

    గుజరాత్ దిశగా ‘తౌటే’ తుఫాన్..

    అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అతి తీవ్ర ‘తౌటే’ తుఫాన్ గుజరాత్ దిశగా పయనమవుతోంది. ముంబైకి పశ్చిమ దిశగా 15 కి.మీ దూరంలో ఉన్న తుఫాన్.. గంటకు 20 కి.మీ వేగంతో ఈ తుఫాన్ కదులుతోంది. ముందుగా ఈ నెల 18న తీరాన్ని దాటుతుందని అంచనా వేయగా.. ఇవాళ రాత్రి 8.30 గంటల నుంచి 11.30 మధ్య గుజరాత్‌లోని పోరుబందర్-మహువా మధ్య తీరం దాటనుంది.

  • 17 May 2021 03:47 PM (IST)

    ముంబై- బీఎంసీలో రాబోయే కొద్ది గంటల్లో భారీ వర్షాలు..

    రాబోయే కొద్ది గంటలు ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరిక జారీ చేసిందని బిఎంసి తెలిపింది. బలమైన గాలులు వీస్తాయని తెలిపింది, 120 కిలోమీటర్ల వేగంతో పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

  • 17 May 2021 03:38 PM (IST)

    మహారాష్ట్రలోని తీర ప్రాంతాల నుండి ఇప్పటివరకు 12,420 మందిని తరలించారు..

    ఇప్పటివరకు 12,420 మంది ప్రజలను తీరప్రాంతాల నుండి మహారాష్ట్రలోని సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్‌ ఉండగా, రాయ్‌గడ్ జిల్లా రెడ్ అలర్ట్‌లో ఉంది.

  • 17 May 2021 03:36 PM (IST)

    ప్రధానితో ‘మహా’ సీఎం భేటి.. ‘తౌటే’పై చర్చ..

    ‘తౌటే’ తుఫాన్ ప్రభావంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేను అడిగి తెలుసుకుంటున్నారు. తీర ప్రాంతాల ప్రజల రక్షణ చర్యలు, పరిస్థితిపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో చర్చిస్తున్నారు.

  • 17 May 2021 03:32 PM (IST)

    ‘తౌటే’ తుఫాన్ ఎఫెక్ట్.. ముంబైలో ఆరెంజ్ అలెర్ట్..

    ముంబైలో ‘తౌటే’ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఇళ్లు, చెట్లు కుప్పకూలిపోతున్నాయి. గుజరాత్ రాష్ట్రం వైపు దూసుకొస్తున్న తౌటే తుఫాన్ రాత్రి 8-8.30 గంటల మధ్య పోర్ బందర్- మహువా ,మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తౌటే ఎఫెక్ట్ నేపధ్యంలో ముంబైలో అరేంజ్ అలెర్ట్ జారీ చేశారు. అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తౌటే తుఫాన్ అతి భీకర తుఫాన్ గా మారిందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేవీతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముంబైలో మొహరించారు.

  • 17 May 2021 03:26 PM (IST)

    ‘తౌటే’ తుఫాను, డీయూ నుండి కేవలం 220 కిమీ దూరంలో..

    అహ్మదాబాద్ వాతావరణ శాఖ శాస్త్రవేత్త మనోరమ మొహంతి మాట్లాడుతూ, సైక్లోన్ తౌటే ఇంకా 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాయంత్రం నాటికి గుజరాత్ తీరానికి వస్తుంది. రాత్రి అది డీయూకు 20 కిలోమీటర్ల తూర్పున ఉంటుంది. గుజరాత్ తీరం దాటుతుంది. గాలి వేగం గంటకు 160-170 కి.మీ ఉంటుంది.

  • 17 May 2021 03:14 PM (IST)

    విమానాశ్రయాలపై తుఫాను ఎఫెక్ట్‌

    తుఫాను కారణంగా భారతదేశ పశ్చిమ తీరానికి చేరుకున్నప్పుడు పౌర విమానయాన మంత్రిత్వశాఖ, భారత విమానాశ్రయాల అథారిటీ గుజరాత్‌, గోవా వ్యాప్తంగా ఉన్న ప్రధాన విమనాశ్రయాలలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది.

  • 17 May 2021 03:08 PM (IST)

    ముంబైలో స్థానిక రైలు సర్వీసులు నిలిపివేత..

    ముంబై స్థానిక రైళ్ల సేవలకు ఆటంకం కలిగింది. సబర్బన్ రైలు ఘాట్కోపర్, విఖ్రోలి మధ్య అరగంట సేపు నిలిచిపోయింది. ఉదయం 11.45 గంటల సమయంలో చునభట్టి, గురు తేజ్ బహదూర్ స్టేషన్ల మధ్య ఓవర్‌హెడ్ వైర్‌పై వినైల్ బ్యానర్ పడటంతో నవీ ముంబైకి రైలు కనెక్టివిటీని అందించే హార్బర్ లైన్‌లోని సేవలు కూడా ప్రభావితమయ్యాయి. సుమారు అరగంట తరువాత బ్యానర్ తొలగించబడింది. ఆ తర్వాత రైలు సర్వీసులు తిరిగి ప్రారంభించబడ్డాయి.

  • 17 May 2021 03:00 PM (IST)

    ముంబైలో తౌటే తుఫాన్ బీభత్సం..

    మసీదు స్టేషన్ సమీపంలో వాటర్‌లాగింగ్ కారణంగా, సిఎస్‌ఎమ్‌టి- వడాలా మధ్య హార్బర్ లైన్ సేవలు మధ్యాహ్నం 1.20 నుండి ఆగిపోయాయి.

  • 17 May 2021 02:52 PM (IST)

    తౌటే తుఫాన్ అప్డేట్..

    మధ్యాహ్నం 1.40 గంటలకు, తుఫాను డీయూకు ఆగ్నేయంగా 162 కిలోమీటర్ల దూరంలో, ముంబైకి పశ్చిమ-వాయువ్య దిశలో 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. తుఫాను 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు కదులుతోంది. గుజరాత్ తీరప్రాంతాల్లో భారీ నుండి చాలా భారీ వర్షపాతం నమోదవుతోంది. అలాగే ముంబై విమానాశ్రయాన్ని ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు మూసివేశారు.

  • 17 May 2021 02:46 PM (IST)

    గుజరాత్‌లో బీభత్సం సృష్టిస్తోన్న ‘తౌటే’ తుఫాన్..

    ‘తౌటే’ తుఫాను గుజరాత్‌లో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తీరం దాటే అవకాశం ఉంది. దీని కారణంగా గుజరాత్ రాష్ట్రంలోని తీర ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. ముంబైకి తుఫాన్ గండం తప్పిందని IMD తెలిపింది. ఇప్పుడు, కొన్ని ప్రాంతాలలో మాత్రమే బలమైన గాలులు పడుతున్నాయని చెప్పింది. ప్రస్తుతం, ఈ తుఫాను ముంబై నుండి 120 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ దిశగా మారి గుజరాత్ వైపు కదులుతోంది. సమాచారం ప్రకారం ఈ తుఫాను రాత్రి 8:00 తర్వాత పోర్బందర్‌కు చేరుకుంటుంది.

Follow us on