నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫెయింజల్ తుఫాన్ తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటడానికి మరికొంత సమయం పడుతుందని వాతావరణశాఖ వెల్లడించింది. తమిళనాడు-పుదుచ్చేరి తీరాల దగ్గర కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాను ప్రభావంతో డిసెంబర్ 1 దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రోణంకి కూర్మనాథ్(మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ) వెల్లడించారు.
ఫెయింజల్ తుఫాన్ నేపథ్యంలో చెన్నై వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో చెన్నై ఎయిర్ పోర్టును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సిన మూడు విమానాలను రద్దు చేస్తూ ఎయిర్ లైన్స్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇటు హైదరాబాద్ నుంచి నడవాల్సిన విమానాలు కూడా రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఏడు విమానాలతో పాటు తిరుపతి నుంచి హైదరాబాద్ విమానాలను రద్దు చేశారు.
అలాగే, ఏపీ తిరుపతిలోనూ విమానాల రాకపోకలపై ప్రతికూల ప్రభావం పడింది. ప్రతికూల వాతావరణం వల్ల దాదాపు పది విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. ముంబై, త్రిపుర వెళ్లే విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..